Top Ten News @ 5 PM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 23 Jun 2021 17:11 IST

1. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి: జగన్‌

రాష్ట్రంలో మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతపై హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌, సీఎంవో అధికారులతో సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజలకు ‘దిశ’ యాప్‌పై పూర్తి అవగాహన కలిగించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి వారి ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

2. Ts News: పిల్లల కోసం ప్రత్యేకంగా 6వేల పడకలు

రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలపై జీవో జారీ చేశామని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదించారు. 170 ప్రైవేటు ఆస్పత్రులపై 350 ఫిర్యాదులు వచ్చాయని.. 30 ఫిర్యాదులు పరిష్కరించి బాధితులకు రూ.72.20లక్షలు వెనక్కి ఇప్పించామని వివరించారు. మిగతా బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని డీహెచ్‌ హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.

3. హెచ్చరించినా సీఎం పట్టించుకోలేదు: భట్టి

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేందుకు నీటి యుద్ధం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టుల విషయంలో తెరాస ప్రభుత్వం, మంత్రులు ఏడాది తర్వాత మేల్కొన్నారని భట్టి ఎద్దేవా చేశారు. సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది కిందటే జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తూ నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని తాము చెప్పినా సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవకముందే హెచ్చరించినప్పటికీ సీఎం పెడచెవిన పెట్టారని ఆరోపించారు.

4. Ts Inter: ఫలితాల విడుదలకు మార్గదర్శకాలు

తెలంగాణలో ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఇంటర్‌ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్‌ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించనున్నారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది.

5. హఫీజ్‌ సయీద్‌ నివాసం సమీపంలో బాంబు పేలుడు

ముంబయి బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి,  లష్కర్ ఉగ్రముఠా నాయకుడు హఫీజ్‌ సయీద్‌ నివాసం సమీపంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న ఆతడి ఇంటి వద్ద బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Jamal Khashoggi: జమాల్‌ హంతకులకు అమెరికాలో శిక్షణ
పీకే - పవార్‌ భేటీ.. 15రోజుల్లో మూడోసారి

6. Corona: చైనా టీకా.. ఆ దేశాల్లో మళ్లీ విజృంభణ!

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోన్న వేళ.. వ్యాక్సిన్లు ఆశాదీపంగా కనిపించాయి. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చైనా టీకాలపై ఆధారపడిన సీషెల్స్‌, మంగోలియా, బహ్రెయిన్‌ వంటి దేశాలు వ్యాక్సిన్ల పంపిణీని భారీ స్థాయిలో చేపట్టాయి. దీంతో త్వరలోనే కొవిడ్‌ నుంచి బయటపడతామని భావించాయి. కానీ ఆ దేశాలు ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. 

7. Mehul Choksi: ఛోక్సీ కిడ్నాప్‌పై ఆధారాలు లేవు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని కిడ్నాప్‌ చేశారన్న దానిపై స్పష్టమైన ఆధారాలు లేవని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రౌనీ అన్నారు. అయితే పబ్లిక్‌ డొమైన్లలో మాత్రం ఆయనను అపహరించినట్లు సమాచారం ఉందని తెలిపారు. ఛోక్సీ అదృశ్యం వ్యవహారంపై ఆంటిగ్వా పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఛోక్సీని ఉద్దేశపూర్వకంగానే డొమినికాకు తీసుకెళ్లారన్న ఆరోపణలపై సాక్ష్యాలు లభించాయా అని ప్రతిపక్ష ఎంపీ అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

8. ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల్లో ₹9వేల కోట్లు బ్యాంకులకు

పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీలకు చెందిన రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేసింది. ఈ ముగ్గురి వల్ల బ్యాంకులకు వాటిల్లిన నష్టాల రికవరీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ముగ్గురు వ్యాపారవేత్తలు తమ సంస్థల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేశారని విచారణలో తేలినట్లు ఈడీ స్పష్టం చేసింది. 

9. Stock market: ఆద్యంతం ఊగిసలాట!

తీవ్ర ఊగిసలాట మధ్య బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు దాదాపు రోజంతా అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. చివర్లో మాత్రం కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయంగా సూచీలు గరిష్ఠ స్థాయిలకు చేరడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. 

10. MAA: రసవత్తరంగా మారిన ‘మా’ ఎన్నికలు

తెలుగు చిత్రపరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ఈ ఏడాది మరింత ఉత్కంఠగా జరగనున్నాయి. ‘మా’లో ఈ సారి త్రిముఖ పోరు జరగనుంది. ఓ వైపు విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, మరోవైపు హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. కాగా, తాజాగా నటి జీవిత సైతం సెప్టెంబర్‌లో జరగనున్న ‘మా’ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

WTC Final: లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు