Updated : 27 Jun 2022 17:03 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ‘మహా’ సంక్షోభం.. శిందే వర్గానికి సుప్రీం ఊరట..!

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడేలా కన్పించట్లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్‌ ఇచ్చిన అనర్హత నోటీసులను సవాల్‌ చేస్తూ ఏక్‌నాథ్‌ శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ మహారాష్ట్ర సర్కారుకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు అనర్హత నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు శిందే వర్గానికి జులై 11 వరకు గడువు కల్పిస్తూ విచారణను వాయిదా వేసింది. 

‘మహా’ సంక్షోభంలో మరో మలుపు.. రెబల్‌ మంత్రుల శాఖలు వెనక్కి

2. యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్‌

యశ్వంత్‌ సిన్హాకు మద్దతు ఇచ్చేలా ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవడం వెనక అనేక కారణాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 8 రాష్ట్రాల్లో భాజపాకు మెజారిటీ లేకపోయినా అక్కడి పరిస్థితులను తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. అయితే, అధికార ఎన్డీయే కూటమి ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు.

3. అమరావతిని శ్మశానమని.. ఇప్పుడు ఎకరా ₹10 కోట్లకు అమ్ముతారా?: చంద్రబాబు

రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని సీఎం జగన్‌కు ఆ ప్రాంత భూములు విక్రయించే హక్కు ఎక్కడిదని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిని శ్మశానమని చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఎకరా రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇచ్చే యత్నాన్ని తప్పుబట్టారు. 

Viral Video: ఎద్దుల పోటీలో అపశ్రుతి.. స్టాండ్ కుప్పకూలి నలుగురి మృతి

4. నన్ను చంపినా సరే ఆ రూట్‌ని ఆశ్రయించను: రౌత్‌

మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం (Maharashtra crisis) కొనసాగుతున్న వేళ తనకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay raut) స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ (ED) సమన్లు ఇవ్వడం తనను అడ్డుకొనేందుకు జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. తనను చంపినా సరే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల మాదిరిగా గువాహటి మార్గాన్ని ఆశ్రయించబోనన్నారు.

శివసేనకు మరో షాక్‌.. సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు

5. ఇద్దరు వ్యక్తులు కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు!

రాష్ట్రపతి పదవికి (Presidential Election) జరుగుతోన్న ఈ ఎన్నికల్లో నెలకొన్న ఈ పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని.. కేవలం రెండు సిద్ధాంతాల మధ్యేనని విపక్షపార్టీలు పేర్కొన్నాయి. విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి రేసులో ఉన్న యశ్వంత్‌ సిన్హా (Yashwant Sinha) నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం విపక్ష నేతలు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Viral Video: వైకాపా తీరుపై ఆగ్రహం.. బూటుతో కొట్టుకున్న తెదేపా నేత

 

6. తెలంగాణలో జులై 6 నుంచి బహిరంగ మార్కెట్‌లోకి పాఠ్యపుస్తకాలు

తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు జులై 6 నుంచి బహిరంగ మార్కెట్‌లో పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణల సంచాలకులు శ్రీనివాసచారి తెలిపారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల్లో ఛాప్టర్ల వారీగా క్యూఆర్ కోడ్ ప్రచురించామని పేర్కొన్నారు. తద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ పాఠాన్ని ఆడియో, వీడియో రూపంలో చదివేందుకు విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.

7. కావాలనే నన్ను ఇరికించారు: బెయిల్‌ పిటిషన్‌లో సుబ్బారావు

సికింద్రాబాద్‌ అల్లర్లలో అభియోగాలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారావు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్మీలో సేవ చేసి.. అదే స్ఫూర్తితో యువత సైన్యంలో చేరేలా ప్రోత్సహించినట్లు అందులో వివరించారు. పోలీసులు తనను కావాలనే అల్లర్ల కేసులో ఇరికించారని ఆరోపించారు.

China: ఎల్‌ఏసీ వద్ద కొత్త కుట్రలను పన్నుతున్న చైనా

8. ఇంగ్లాండ్‌తో టెస్టు.. మయాంక్‌ అగర్వాల్‌కు పిలుపు

ఇంగ్లాండ్‌తో కీలకమైన ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో టీమ్‌ఇండియా తరఫున ఎవరు ఓపెనింగ్‌ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా దూరం కాగా, తాజాగా రోహిత్‌ శర్మ సైతం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మయాంక్‌ అగర్వాల్‌ ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లాడు. సాయంత్రానికల్లా జట్టుతో కలవనున్నాడు. 

9. జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు. అత్యాచారానికి గురైన మైనర్ బాలికను చంచల్ గూడ జైలుకు పోలీసులు తీసుకెళ్లారు. న్యాయమూర్తి సమక్షంలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ను, ఆ తర్వాత సైదాబాద్‌లోని జువైనల్ హోంకు తీసుకొచ్చి ఐదుగురు మైనర్ బాలుర గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. 

10. వరుసగా మూడో రోజూ లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో వరుసగా మూడో రోజూ రాణించాయి. అమెరికా సహా ఆసియా మార్కెట్లు లాభాల బాటలో పయనించడానికి తోడు క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చింది. దేశీయంగా నైరుతి రుతు పవనాల వల్ల రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన సైతం మదుపరుల్లో సానుకూలతను నింపింది

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని