Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 14 Mar 2024 17:02 IST

1. పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్ పోటీ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ వీడింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు  పవన్‌ స్వయంగా వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ సభలో ఈమేరకు ప్రకటన చేశారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని,  ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కొత్త ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌

కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission)లో ఖాళీ అయిన కమిషనర్ల (Election Commissioners) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం సమావేశమైంది. కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకముందే.. కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ (Adhir Ranjan Chowdhury) పేర్లను బయటపెట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: మాజీ మంత్రి మల్లారెడ్డి

మాజీ మంత్రి, మల్కాజిగిరి భారాస ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. ‘‘బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ను కలిశా. అందులో ఎలాంటి రాజకీయం లేదు. నేను భారాసలోనే కొనసాగుతా. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతా. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’’ అని స్పష్టం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయింపు

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఈసీ కేటాయించింది. ఆయన సారథ్యంలోని జైభారత్‌ నేషనల్‌ పార్టీకి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్‌ సింబల్‌గా టార్చిలైట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కామన్‌ సింబల్‌ కేటాయించడం పట్ల ఈసీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టీఎస్‌ కాదు టీజీ.. రేపటి నుంచే అమలు

ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లపై టీఎస్‌ను టీజీగా మారుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. శుక్రవారం (మార్చి 15) నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు అన్నీ ఇకపై టీజీగా వస్తాయని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భువనేశ్వర్‌-విశాఖ వందే భారత్‌ టికెట్‌ ధరలు ఇవే..!

తూర్పు కోస్తా రైల్వే పరిధిలో భువనేశ్వర్‌- విశాఖ (Bhubaneswar-visakhapatnam) మధ్య వందే భారత్‌ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈనెల 12న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. తాజాగా ఈ రైలు టికెట్‌ ధరలు వెల్లడయ్యాయి. ఈనెల 17 నుంచి ప్రయాణానికి ఐఆర్‌సీటీసీలో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆధారాల ధ్వంసం కేసు.. ప్రణీత్‌రావును కస్టడీకి కోరనున్న పోలీసులు

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో హోదాను అడ్డుపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును కస్టడీలోకి తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. ఆధారాల ధ్వంసం కేసులో ఇప్పటికే ప్రణీత్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్‌ ఖైదీగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్ల గడువు పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్‌

ఒక్కో యూజర్‌పై వచ్చే ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడానికి సాధారణంగా టెలికాం సంస్థలు ప్రీపెయిడ్‌ ప్లాన్ల గడువును కుదిస్తుంటాయి. కానీ, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) సంస్థ అనూహ్యంగా రెండు ప్లాన్ల కాలపరిమితిని ఇటీవల పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ పథకాలను కంపెనీ సుదీర్ఘకాలంగా తమ కస్టమర్లకు అందిస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ55, ఏ35 ధర, ఫీచర్లివే..

భారత్‌లో శామ్‌సంగ్‌ ఇటీవల గెలాక్సీ ఏ55, ఏ35 స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. తాజాగా వాటి ధరలతో పాటు పూర్తి ఫీచర్లను వెల్లడించింది. 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5,000mAh బ్యాటరీ, ఎగ్జినోస్‌ ప్రాసెసర్‌ వంటి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ల పూర్తి వివరాలేంటో చూద్దాం..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 18 ఓటీటీలపై కేంద్రం కొరడా

అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఆన్‌లైన్ వేదికలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటి ప్రసారాల్లో మార్పు రాకపోవడంతో 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, 57 సోషల్‌ మీడియా ఖాతాలను తొలగించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని