Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 08 Apr 2024 21:00 IST

1. షర్మిల బస్సు యాత్రలో వైకాపా కవ్వింపు చర్యలు

వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరులో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిర్వహించిన బస్సు యాత్రలో వైకాపా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆమె ప్రసంగిస్తుండగా  ‘జై జగన్‌’ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దమ్ముంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి’ అంటూ మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు ఏమయ్యాయి?: హరీశ్‌రావు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. 100 రోజులు గడిచినా వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  సిద్దిపేటలోని మల్లయ్య గార్డెన్‌లో యువతతో ఆయన సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జనసేనకు చిరంజీవి భారీ విరాళం

జనసేన విజయాన్ని కాంక్షిస్తూ ప్రముఖ నటుడు చిరంజీవి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌ నగర శివారులోని ముచ్చింతల్‌లో ‘విశ్వంభర’ షూటింగ్‌ లొకేషన్‌లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇద్దరూ వెళ్లి చిరంజీవిని కలిశారు. ఆత్మీయ ఆలింగనంతో సోదరులకు ఆయన స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

ఉగాది వేడుకల వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. మెట్రో రైలులో వేర్వేరు వర్గాలకు అందిస్తున్న రాయితీలు మార్చి 31తో ముగియగా.. వాటిని మళ్లీ ఆరు నెలలపాటు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఏఏ వల్ల భారతీయులెవరూ పౌరసత్వాన్ని కోల్పోరు: రాజ్‌నాథ్ సింగ్

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుతో భారతీయులెవరూ తమ పౌరసత్వాన్ని కోల్పోరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఈ అంశంపై ప్రజల్లో అనవసర గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మేనిఫెస్టోపై మోదీ విమర్శలు.. ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఆ పార్టీ మండిపడింది. దీంతో ఆయనపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఆప్‌ మంత్రులు బాధ్యతగా లేరు’.. కేంద్ర హోంశాఖకు ఎల్జీ ఫిర్యాదు

దేశ రాజధాని దిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ఆప్‌ ప్రభుత్వం మధ్య మరో వివాదం రాజుకుంది. పాలనాపరమైన వ్యవహారాల్లో దిల్లీ మంత్రులు సహకరించడం లేదని ఎల్జీ వీకే సక్సేనా ఆరోపించారు. ఆయా శాఖల పనితీరుపై చర్చించేందుకు మంత్రులను సమావేశాలకు పిలిచినా సాకులు చెబుతూ నిరాకరిస్తున్నారని పేర్కొంటూ.. కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బోట్‌ యూజర్లకు షాక్‌.. రిస్క్‌లో 75 లక్షల మంది డేటా

ప్రముఖ ఆడియో ఉత్పత్తులు, స్మార్ట్‌ వాచ్‌ల తయారీ సంస్థ బోట్‌ (boAt) యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. సుమారు 75 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైంది. లీకైన డేటాలో వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫోన్‌ నంబర్లు, కస్టమర్‌ ఐడీలు వంటివి ఉన్నాయి. తస్కరించిన  డేటాలో సుమారు 2జీబీ డేటాను హ్యాకర్‌ ఓ ఫోరమ్‌లో అందుబాటులో ఉంచినట్లు ఫోర్బ్స్‌ ఇండియా పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కెప్టెన్‌ కోరుకునేది ఇదే కదా.. రోహిత్ డ్రెస్సింగ్‌ రూమ్‌ స్పీచ్‌ వైరల్

‘‘మన బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌ నుంచి మనందరం దీని కోసమే ప్రయత్నిస్తున్నాం. వ్యక్తిగత ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకోవద్దు. బ్యాటింగ్‌ విభాగంలోని ప్రతిఒక్కరూ తమవంతు సహకారాన్ని అందిస్తే లక్ష్యాన్ని చేరుకోగలం’’ అంటూ ముంబయి కెప్టెన్‌ రోహిత్ శర్మ తన జట్టు సభ్యుల్లో స్ఫూర్తిని నింపే ప్రసంగం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్‌ అవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇజ్రాయెల్‌ సేనల ఉపసంహరణ.. ఆ నగరంలో ‘మనుగడ కష్టమే’!

దక్షిణ గాజాలో ఖాన్‌ యూనిస్‌ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు వెల్లడించాయి. దీంతో కొన్ని నెలలుగా తమ నివాసాలకు దూరంగా తలదాచుకున్న వేల కుటుంబాలు సొంత గూటికి తిరుగు పయనమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని