Congress: మేనిఫెస్టోపై మోదీ విమర్శలు.. ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోపై చేసిన వ్యాఖ్యలకు గానూ ప్రధాని మోదీపై ఆ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

Published : 08 Apr 2024 19:56 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ (Congress) ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఆ పార్టీ మండిపడింది. దీంతో ఆయనపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. 

‘‘సల్మాన్ ఖుర్షీద్‌, ముకుల్‌ వాస్నిక్‌, పవన్‌ ఖేరా, గుర్దీప్‌ సప్పల్‌లతో కూడిన కాంగ్రెస్‌ బృందం నేడు ఎన్నికల కమిషన్‌ను కలిసింది. ఈసీకి మొత్తం ఆరు ఫిర్యాదులు ఇవ్వగా.. అందులో రెండు ప్రధానిపై ఉన్నాయి. ఈసీ తన స్వతంత్రతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో భాజపా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌ ప్రకటించిన మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అది ముస్లిం లీగ్‌ మేనిఫెస్టో మాదిరిగానే కనిపిస్తోందన్నారు. హస్తం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని ప్రతీ పేజీలో అబద్ధాలే ఉన్నాయన్నారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని.. కాంగ్రెస్‌కు సిద్ధాంతాలు, విధానాలు లేవని విమర్శించారు. పార్టీని అవుట్‌సోర్సింగ్‌కు అప్పగించినట్లు కనిపిస్తోందన్నారు.   

ఓటమి భయంతోనే ఇదంతా..

మోదీ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్‌ అగ్గిమీద గుగ్గిలమైంది. లోక్‌సభ ఎన్నికల్లో 180 సీట్లను సాధించేందుకు భాజపా కష్టపడుతోందని.. ఆ భయంతోనే హిందూ- ముస్లిం కథను తెరపైకి తీసుకొస్తోందని విమర్శనాస్త్రాలు సంధించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నాయకుల బృందం మోదీ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని