Operation Ganga: ఉక్రెయిన్‌ నుంచి 6400 మంది స్వదేశానికి..!

ఆపరేషన్‌ గంగా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 6,400 మంది భారతీయులను ఉక్రెయిన్‌ నుంచి సురక్షితంగా స్వదేశానికి తరలించామని విదేశాంగశాఖ వెల్లడించింది.

Published : 03 Mar 2022 21:47 IST

24గంటల్లోనే 3వేల మందిని తీసుకువచ్చామన్న విదేశాంగశాఖ

దిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ గంగా’ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గడిచిన 24 గంటల్లోనే 3వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చామని విదేశాంగశాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో ఇప్పటివరకు మొత్తం 6,400 మందిని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు సురక్షితంగా తరలించామని పేర్కొంది. మరో 24గంటల్లో 18 విమానాల్లో భారత పౌరులు ఇక్కడికి చేరుకుంటారని తెలియజేసింది.

‘తొలి అడ్వైజరీ జారీ చేసిన తర్వాత 18వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటి బయటకు వచ్చారు. ఆపరేషన్‌ గంగా కార్యక్రమంలో ఇప్పటివరకు 30 ప్రత్యేక విమానాల్లో 6400 మందిని సురక్షితంగా తీసుకువచ్చాం. మరో 24గంటల్లో 18 విమానాలు భారత్‌ చేరుకోనున్నాయి’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. ఈ విషయమై ఉక్రెయిన్‌, రష్యా దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామన్న ఆయన.. ఇప్పటికే రష్యా అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు.

మరోవైపు వరుస దాడులతో అట్టుడుకుతోన్న ఖర్కివ్‌ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులకు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా మరో అడ్వైజరీ జారీచేసింది. అక్కడ చిక్కుకుపోయిన వారందరూ అత్యవసర ప్రాతిపదికన ఓ దరఖాస్తు నింపాలంటూ సూచించింది. పిసొచిన్‌ మినహా ఖర్కివ్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ ఆ దరఖాస్తులో వివరాలను పొందుపరచాలని భారత ఎంబసీ స్పష్టం చేసింది.

దిలాఉంటే, కేంద్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీనాటికి మొత్తం 45కుపైగా విమానాలను నడపాలని నిర్ణయించింది. అందులో బుకారెస్ట్‌ నుంచి 28, బుడాపెస్ట్‌ నుంచి 10, రెసెసో నుంచి 6, కొసైస్‌ నుంచి ఒక విమానం నడపాలని నిర్ణయించి అందుకు తగినట్లు విమాన సమయాలను షెడ్యూల్‌ చేసింది. ఇప్పటికే ఇందులో కొన్ని భారత్‌కు చేరుకోగా.. మరో రెండు రోజుల్లోనే దాదాపు అన్ని విమానాలు భారత్‌కు చేరుకోనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని