పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌..ఎప్పుడు రావచ్చంటే..!

వ్యాక్సిన్‌లన్నీ కేవలం 16-18ఏళ్ల వయసు పైబడిన వారికే అని ఆయా సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.

Published : 17 Dec 2020 20:28 IST

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న ప్రయోగాల ఫలితాలు సానుకూలంగానే వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌, రష్యాల్లో అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్‌లన్నీ కేవలం 16-18ఏళ్ల వయసు పైబడిన వారికే అని ఆయా సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.

అమెరికా, బ్రిటన్‌లో ఈ మధ్యే అత్యవసర వినియోగ అనుమతి పొందిన ఫైజర్‌ వ్యాక్సిన్‌ను కేవలం 16ఏళ్లకు పైబడినవారికే వినియోగించాల్సి ఉంటుంది. అయితే, 12ఏళ్ల వయసువారిపై ప్రయోగాలను ఫైజర్ సంస్థ అక్టోబర్‌ నెలలోనే‌ ప్రారంభించింది. ఈ ప్రయోగాలు మరికొన్ని నెలలపాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం వినియోగంపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీటి ఫలితాల ఆధారంగానే చిన్నారులపై ప్రయోగాల అనుమతులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఫైజర్‌ తర్వాత అమెరికాలో అనుమతి పొందనున్న మరో వ్యాక్సిన్‌ కంపెనీగా మోడెర్నా నిలువనుంది. ఇప్పటికే మోడెర్నా తయారుచేసిన వ్యాక్సిన్‌ సురక్షితమని ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఈ నేపథ్యంలో 12 నుంచి 17ఏళ్లలోపు యువకులపై ప్రయోగాలను ప్రారంభించేందుకు మోడెర్నా సిద్ధమైంది. ఈనెల నుంచే వాలంటీర్లను నమోదుచేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, వీరిని సంవత్సరంపాటు పరీక్షించనున్నట్లు సమాచారం. ఇక 12 ఏళ్లకన్నా తక్కువ వయసుగల వారిపై మాత్రం ప్రయోగాలను 2021లోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం పెద్దవారికోసం రూపొందించిన వ్యాక్సిన్‌లు సమర్థవంతంగానే పనిచేస్తుండడంతో చిన్నారులపై ప్రయోగాలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయని అమెరికాలోని వాండెర్‌బిల్ట్‌ యూనివర్సిటీకి చెందిన పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ బడ్డీ క్రీచ్‌ పేర్కొన్నారు. ‘కరోనా వైరస్‌ వల్ల పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురౌతున్న సంఘటనలు తక్కువే అయినప్పటికీ..వారినుంచి వైరస్‌ ఇతరులకు వ్యాపించడంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఇప్పటికే దాదాపు 16లక్షల మంది చిన్నారులు వైరస్‌ బారినపడ్డట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీరిలో దాదాపు 8వేల మంది ఆసుపత్రిలో చేరగా వీరిలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు’ అని పిల్లల కోసం ఫైజర్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ రాబర్ట్‌ ఫ్రెంక్‌ అన్నారు. అందుచేత పిల్లలకు వ్యాక్సిన్‌ అందించడం కూడా ఎంతో ముఖ్యమని రాబర్ట్‌ ఫ్రెంక్‌ అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, ఇప్పటివరకు కొనసాగుతోన్న వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఎక్కువగా 18-65ఏళ్ల మధ్య వయసువారిలోనే ఉన్నాయి. వృద్ధుల్లోనూ పరీక్షించగా.. మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు మధ్యంతర ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై ప్రయోగాలపై వ్యాక్సిన్‌ కంపెనీలు దృష్టిపెట్టాయి. వీటి ప్రయోగ ఫలితాలు వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి..
కొవిడ్‌ టీకా: రష్యాలో మిశ్రమ స్పందనే..!
కరోనా టీకా సైడ్‌ ఎఫెక్ట్స్‌? మంచిదేనట!

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని