‘ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన’పై కమిటీ!

రేషన్‌ సరుకులను నేరుగా ఇంటికే చేరవేసే (హోమ్‌ డెలివరీ) ప్రయత్నాల్లో ఉన్న దిల్లీ ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది.

Published : 07 Oct 2020 23:09 IST

దిల్లీ: రేషన్‌ సరకులను నేరుగా ఇంటికే చేరవేసే (హోమ్‌ డెలివరీ) ప్రయత్నాల్లో ఉన్న దిల్లీ ప్రభుత్వం.. ఆ పనులను వేగవంతం చేసింది. దిల్లీలో ‘ముఖ్యమంత్రి ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన’ అమలు చేయడం కోసం ఆరుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. హోమ్‌ డెలివరీలో భాగంగా సరఫరా ఏజెన్సీలకు లైసెన్సుల జారీ ప్రక్రియపై ఈ కమిటీ పలు సిఫార్సులు చేయనుంది. ఈ పథకం అమలు కోసం లైసెన్సుల జారీ, ఎదురయ్యే సమస్యలు, సూచనలను వారంలోగా నివేదించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

రేషన్‌ సరకులను నేరుగా లబ్దిదారుల ఇంటికే పంపిణీ చేసే ‘ముఖ్యమంత్రి ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన’ పథకానికి దిల్లీ మంత్రివర్గం జులై నెలలోనే ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ పథకానికి అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేయడంతోపాటు టెండర్ల ప్రక్రియ చేపడుతోంది. ఈ పథకాన్ని విప్లవాత్మక ముందడుగుగా అభివర్ణించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, వచ్చే ఆరుమాసాల్లోనే ఇది అమలులోకి తెస్తామని జులైలో ప్రకటించారు. ఈ పథకం ద్వారా బియ్యం, గోధుమ పిండి, చక్కెర ప్యాకెట్లను లబ్ధిదారుల ఇంటికే పంపిణీ చేస్తారు. అయితే, వీటిని రేషన్‌ దుకాణాల్లోనూ తీసుకునే వీలుంటుంది. దిల్లీలో 17లక్షలకుపైగా కుటుంబాలకు రేషన్‌ కార్డులుండగా దాదాపు 70లక్షల మంది లబ్ధిపొందుతున్నట్లు దిల్లీ ప్రభుత్వం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని