2019-20: కస్టడీలో ప్రతి రోజూ ఐదుగురి మృతి!

2019-20 ఆర్థిక సంవత్సరంలో కస్టడీకి తీసుకున్న నిందితుల్లో ప్రతి రోజూ ఐదుగురు మృతి చెందినట్లు...

Published : 17 Sep 2020 01:32 IST

పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్ర హోంశాఖ

దిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరంలో కస్టడీలోని నిందితుల్లో ప్రతి రోజూ ఐదుగురు మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. నిన్న(మంగళవారం) పార్లమెంట్‌కు కేంద్ర హోంశాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి 31 వరకు పోలీస్ కస్టడీ, జైళ్లలో దాదాపు 1,697 మంది ప్రాణాలు విడిచినట్లు పేర్కొంది. 1,697 మరణాల్లో 1,584 మరణాలు జ్యుడీషియల్‌, 113 మంది పోలీస్‌ కస్టడీలో ప్రాణాలు కోల్పోయారు. నిందితుల నుంచి వాస్తవాలు రాబట్టేందుకు పోలీసులు తమ చేతులకు ఎక్కువగా పని చెబుతుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడులో ఇలానే తండ్రీకొడుకు పోలీస్‌ కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే. ఇప్పుడు ఆ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారిస్తోంది. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో జ్యుడీషియల్‌ కస్టడీలో అత్యధికంగా 400 మంది మృతి చెందగా.. తర్వాత మధ్యప్రదేశ్‌ (143), పశ్చిమ్‌ బంగా (115), బిహార్‌ (105), పంజాబ్‌ (93), మహారాష్ట్ర (91) ఉన్నాయి. పోలీస్‌ కస్టడీ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా 14 మరణాలు సంభవించినట్లు కేంద్రం తెలిపింది. తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో పోలీస్ కస్టడీలో 12 మంది చొప్పున మృతి చెందారు. పోలీస్‌, జ్యుడీషియల్‌ కస్టడీలో మృతి చెందడానికి కారణాలను మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. గత ఆర్థిక సంవత్సరం కాలంలో 112 ఎన్‌కౌంటర్లు జరిగినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్లో 39, ఉత్తర్‌ప్రదేశ్‌లో 26, ఝార్ఖండ్‌లో ఆరు ఎన్‌కౌంటర్లు జరిగాయి. 

దేశంలోని 4,03,739 సామర్థ్యంతో 1,350 జైళ్లు ఉన్నట్లు హోంశాఖ వెల్లడించింది. అన్ని జైళ్లల్లో అంతకంటే ఎక్కువ మంది ఖైదీలు ఉన్నట్లు పేర్కొంది. అన్ని జైళ్లల్లో కలిపి దాదాపు 4,78,600 మంది ఖైదీలు ఉన్నట్లు వివరించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 72 జైళ్లలో 1,01,297 మంది ఉన్నారని, అయితే వాటి సామర్థ్యం కేవలం 60,340 మాత్రమేనని కేంద్ర హోంశాఖ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని