కోలికోడ్‌: సాయం చేసిన 26 మందికి కరోనా

కేరళ విమాన ప్రమాద సమయంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న 26మంది స్థానికులకు కరోనా వైరస్‌ సోకినట్లు మలప్పురం జిల్లా వైద్య అధికారులు వెల్లడించారు.

Published : 21 Aug 2020 02:27 IST

కోలికోడ్: కేరళలోని కోలికోడ్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పి ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు.. గాయపడిన ప్రయాణికులను వివిధ ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడగలిగారు. అలా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న 26మంది స్థానికులకు కరోనా వైరస్‌ సోకినట్లు మలప్పురం జిల్లా వైద్య అధికారులు వెల్లడించారు.

విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల్లో ఒకరికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లను క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అనంతరం వారికి కొవిడ్‌ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా చాలా మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ప్రస్తుతం వారిలో 26మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వెల్లడైంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక యువకులు స్పందించిన తీరుపై దేశవ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఇప్పటికే విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా ధన్యవాదాలు తెలిపింది. ఆపత్కాలంలో స్పందించిన తీరుకు వారికి రుణపడి ఉంటామని ప్రకటించింది.

ఇప్పటికే స్థానిక జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో పాటు మరో 21మంది అధికారులకు వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. వీరందరూ విమాన ప్రమాద ఘటనా ప్రాంతంలో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని