
వైట్‌హౌస్‌లో క్రిస్మస్: ట్రైలర్ చూస్తారా!
శ్వేతసౌధంలో మెలానియా చివరి క్రిస్మస్..
వాషింగ్టన్: ఈ సారి క్రిస్మస్ పండుగ అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌కు చేదు, తీపి కలబోతగా నిలువనుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగియటం.. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించలేక పోవటంతో ఇదే వారికి శ్వేతసౌధంలో నాలుగవది, చివరిది కానుంది. పండుగ సందర్భంగా అధ్యక్షుడి సతీమణి మెలానియా ఆధ్వర్యంలో శ్వేతసౌధాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో 125 మందికి పైగా వాలెంటీర్లు పాల్గొన్నారట. ఈసారి ‘‘అమెరికా ది బ్యూటిఫుల్’’ అనే అంశం ఆధారంగా అధ్యక్ష భవనాన్ని అలంకరించారు.
దీనిలో అమెరికా జాతీయ పతాకాలు, చిహ్నాలతో పాటు లెక్కకు మించిన గులాబీలు, విద్యుత్ దీపాలు, వేలాడే అలంకరణ వస్తువులు, రైళ్లు, విమానాలు, పడవలు.. ఇలా ఎన్నో భాగమయ్యాయి. ఎన్నో అద్భుతమైన పెయింటింగ్‌లు కూడా వీక్షకుల కన్నుల పండుగ కానున్నాయి. ప్రముఖ మహిళా నేతల చిత్రలు కూడా ఈసారి క్రిస్మస్ అలంకరణలో భాగం కావటాన్ని చూడవచ్చు. ఆ సొగసులను ఒక నిమిషం పాటు సాగే ఈ వీడియో రూపంలో మెలానియా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. భవనం అలంకరణకు దీటుగా మిలమిల మెరిసే బంగారపు రంగు దుస్తులతో, చక్కని చిరునవ్వుతో ఆమె ఉన్న ఈ వీడియో పలువురిని ఆకర్షిస్తోంది. వైట్‌హౌస్‌లో ఘనంగా జరిగే క్రిస్మస్ సంబరాలకు ట్రైలర్ లాంటి ఈ వన్ మినిట్ వీడియోను మీరూ చూసేయండి మరి!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.