ఆస్ట్రాజెనెకా టీకాకు యూకే అనుమతి

కరోనా కొత్తరకం వైరస్‌తో సతమతమవుతున్న యూకే ప్రభుత్వం మరో వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగం కింద అనుమతులు మంజూరు చేసింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాను బుధవారం

Updated : 30 Dec 2020 16:13 IST

లండన్‌: కరోనా కొత్తరకం వైరస్‌తో సతమతమవుతున్న యూకే ప్రభుత్వం మరో వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగం కింద అనుమతులు మంజూరు చేసింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాను బుధవారం ఆమోదించింది. వచ్చే వారం ఈ వ్యాక్సిన్‌ పంపిణీని చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఫైజర్‌ తర్వాత యూకేలో అనుమతి లభించిన రెండో టీకా ఇదే. కాగా.. ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన మూడో కరోనా వ్యాక్సిన్ ఇది. 

డిసెంబరు తొలివారంలో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకాను యూకే ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. 90ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ ప్రపంచంలోనే తొలి కరోనా టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు ఆ దేశంలో 6లక్షలకు పైగా మంది టీకా వేయించుకొన్నారు. అయితే, ఇటీవల అక్కడ కొత్తరకం కరోనా బయటపడి కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన బ్రిటన్‌ ప్రభుత్వం మరో టీకాను అత్యవసరంగా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 100 మిలియన్ ఆస్ట్రాజెనెకా డోసులను ఆర్డర్ చేసింది. వచ్చే ఏడాది తొలివారంలో ఈ టీకా పంపిణీ ప్రారంభం కానుంది. మరోవైపు బ్రిటన్‌లో కొత్తరకం కరోనా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. సోమవారం ఒక్కరోజే అక్కడ 20వేలకు పైగా స్ట్రెయిన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆసుపత్రులన్నీ కొవిడ్‌ బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. 

అమెరికాలోనూ రెండు..

అటు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలోనూ రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఫైజర్‌తో పాటు మోడెర్నా టీకాకు కూడా యూఎస్‌ ఎఫ్‌డీఏ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ఫైజర్‌ టీకా.. కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మోడెర్నా టీకాను తీసుకున్నారు.

భారత్‌లోనూ త్వరలో అనుమతులు?

యుకేలో ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతులు రావడంతో భారత్‌లో టీకా విడుదలకు మార్గం మరింత సుగమమైంది. భారత్‌లోనూ త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆస్ట్రాజెనెకా వైపే మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫైజర్‌తో పోలిస్తే ఆస్ట్రాజెనెకా టీకా ధర తక్కువగా ఉండటంతో పాటు.. భద్రపరచడం కూడా సులువుగా ఉండటంతో ఈ వ్యాక్సిన్‌ వినియోగంపై పరిశీలనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఈ టీకాను ఉత్పత్తి చేస్తోంది. 

ఇవీ చదవండి..

కొవిడ్‌ బాధితులతో బ్రిటన్‌ ఆసుపత్రులు కిటకిట!

అమెరికాలోనూ కొత్తరకం!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని