ఆయుధపూజ నిర్వహించిన రాజ్‌నాథ్ సింగ్‌

చైనాతో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలోనే సమసిపోవాలని కోరుకుంటున్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్న ఆయన.. పర్యటనలో భాగంగా డార్జిలింగ్‌ లోని సుక్నా యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు..

Published : 26 Oct 2020 00:58 IST

డార్జిలింగ్‌: చైనాతో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలోనే సమసిపోవాలని కోరుకుంటున్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్న ఆయన.. పర్యటనలో భాగంగా డార్జిలింగ్‌ లోని సుక్నా యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడున్న ఆయుధాలకు పూజలు నిర్వహించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు సమసిపోయి, సరిహద్దుల్లో శాంతి స్థాపన జరగాలన్నదే భారత్‌ అభిమతమని రాజ్‌నాథ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. తావర్‌ అసాల్ట్‌ రైఫిల్‌ను ఎక్కుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణె, ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు వీలైనంత త్వరగా సద్దుమణగాలని భారత్‌ కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆ నమ్మకం తనకుందని చెబుతూనే.. అంగుళం భూమిని కూడా వదులు కునేందుకు భారత్‌ సిద్ధంగా లేదని రాజ్‌నాథ్‌ అన్నారు. ఈ మేరకు చైనాకు మరోసారి గట్టి హెచ్చరికలు పంపినట్లయింది. ‘‘భారత్‌- చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లో జరిగిన ఘటననను చూసిన తర్వాత చెబుతున్నా. భారతీయ సేనలు పోషించిన పాత్ర, చూపించిన తెగువ రాబోయే రోజుల్లో చరిత్రలో నిలిచిపోతుంది. భారతీయ సేనల శౌర్య పరాక్రమ గాథలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారు.’’ అని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. అంతకు ముందు ఆయన దేశ ప్రజలకు ట్విటర్‌ ద్వారా దసరా శుభాకాంక్షలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని