ఆ విద్యార్థికి ఐఐటీలో ప్రవేశం కల్పించండి: సుప్రీం 

ఐఐటీలో చేరేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. చిన్న పొరపాటు కారణంగా సీటు పోగొట్టుకున్న విద్యార్థి వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఆ విద్యార్థికి మధ్యంతర అడ్మిషన్‌ కల్పించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఐఐటీ బాంబేకు సూచించింది.

Updated : 09 Dec 2020 22:25 IST

దిల్లీ: ఐఐటీలో చేరేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. చిన్న పొరపాటు కారణంగా సీటు పోగొట్టుకున్న విద్యార్థి వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఆ విద్యార్థికి మధ్యంతర అడ్మిషన్‌ కల్పించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఐఐటీ బాంబేకు సూచించింది. జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం బాధితుడి పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపింది. న్యాయవాది ప్రహ్లాద్‌ పరంజిపే విద్యార్థి తరపున వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం ధర్మాసనం ఆ విద్యార్థికి మధ్యంతర ప్రవేశం కల్పించేందుకు అనుమతించాలని ఐఐటీ బాంబేకు సూచించింది. 

ఐఐటీలో చేరేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని.. తప్పు లింక్‌ను క్లిక్‌ చేసినందుకు సీటు కోల్పోయానని సిద్ధాంత్‌ బాత్ర అనే విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల్ని కోల్పోయిన తాను తాత, నాయనమ్మల వద్ద ఉండి కష్టపడి చదివి 270 ర్యాంకు సాధించానని.. ఎలాగైనా తనకు సీటు ఇప్పించాలని సుప్రీంకోర్టు పిటిషన్‌లో సిద్ధాంత్‌ అభ్యర్థించాడు. 

ఐఐటీలో ఆలిండియా స్థాయిలో 270 ర్యాంకు
ఆగ్రాకు చెందిన సిద్ధాంత్‌ బాత్రా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ఆల్‌ఇండియా స్థాయిలో 270 ర్యాంకు సాధించాడు. ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో సీటు కోసం అడ్మిషన్‌ ప్రక్రియలో భాగంగా.. చివరి దశలో తప్పుడు లింక్‌ క్లిక్‌ చేశాడు. ఈ క్రమంలో ఐఐటీ బాంబే ఇటీవల ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేయగా అందులో తన పేరు రాలేదు. సిద్ధాంత్‌ సీటును వదులుకున్నట్లు ఐఐటీ బాంబే పోర్టల్‌లో వెల్లడించింది. ఆందోళనకు గురైన సిద్ధాంత్‌ తప్పుడు లింక్‌ క్లిక్‌ చేయడం వల్లే ఇలా జరిగిందని.. తనను చేర్చుకోవాలంటూ వెళ్లి క్యాంపస్‌ సిబ్బందిని కోరాడు. దానికి సిబ్బంది ప్రతిస్పందిస్తూ.. సీట్లు అన్ని అయిపోయాయి.. తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని బదులిచ్చారు. దీంతో ఆ విద్యార్థి మొదట బాంబే హైకోర్టును సంప్రదించగా.. నవంబర్‌ 23 జస్టిస్‌ జీఎస్‌ కులకర్ణి నేతృత్వంలోని ధర్మాసనం తన పిటిషన్‌ను తిరస్కరించింది. 

ఇదీ చదవండి..

ట్విటర్‌: ఇమ్రాన్‌ ఎవర్నీ ఫాలో అవ్వట్లేదు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని