Covid Origin: ఇప్పటికి జరిపిన దర్యాప్తు చాలు.. కొత్తగా కుదరదు..! 

కరోనా మూలాలపై మరోసారి దర్యాప్తు చేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇచ్చిన పిలుపును చైనా తిరస్కరించింది.

Published : 14 Aug 2021 01:08 IST

WHO పిలుపును తిరస్కరించిన చైనా

బీజింగ్: కరోనా మూలాలపై మరోసారి దర్యాప్తు చేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇచ్చిన పిలుపును చైనా తిరస్కరించింది. తాము రాజకీయ దర్యాప్తు కంటే శాస్త్రీయ విచారణకే మద్దతు ఇస్తామంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ దేశంలోని వుహాన్ నగరం నుంచి కరోనా వైరస్ ఉద్భవించిందని ప్రపంచమంతా విశ్వసిస్తోంది. దాంతో అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లతో ఈ జనవరిలో ఆరోగ్య సంస్థకు చెందిన బృందం అక్కడ దర్యాప్తు చేపట్టింది. అది మొదటి దశ నివేదికను రూపొందించింది. అయితే దాంట్లో కరోనా మూలాలపై కచ్చితమైన వివరాలు మాత్రం వెలుగులోకి రాలేదు.

ఈ క్రమంలో మరోసారి దర్యాప్తు జరిపేందుకు ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం స్పందిస్తూ.. వ్యాధి మూలాలపై పరిశోధనను పునరుద్ధరించేందుకు కొవిడ్ ప్రారంభ సమాచారాన్ని పంచుకోవాలని చైనాను కోరింది. ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ చైనా ఎప్పటిలాగే స్పందించింది. ఇప్పటికి జరిపిన దర్యాప్తు చాలని, తాజాగా ఇచ్చిన పిలుపు రాజకీయంగా ప్రేరేపితమైందని విమర్శించింది. ‘మేం రాజకీయ దర్యాప్తును వ్యతిరేకిస్తున్నాం. శాస్త్రీయ దర్యాప్తుకే మద్దతు ఇస్తాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా సంయుక్తంగా విడుదల చేసిన నివేదికను అంతర్జాతీయ సమాజం గుర్తించింది. శాస్త్రీయ గుర్తింపు కూడా లభించింది. ఈ నివేదిక ఆధారంగానే భవిష్యత్తు దర్యాప్తు జరగాలి. మళ్లీ కొత్తగా దర్యాప్తు కుదరదు’ అని చైనా విదేశాంగ శాఖకు చెందిన సహాయ మంత్రి మా ఝావోగ్జు మీడియాకు వెల్లడించారు.

కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మరో ఆతిథ్య జంతువులోకి చేరి.. అక్కడి నుంచి మనుషులకు సోకిందని గత నివేదిక వెల్లడించింది. ల్యాబ్ లీక్ సిద్ధాంతం అసంభవమని పేర్కొంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు 20 కోట్ల మంది ఈ మహమ్మారి బారినపడగా.. 43లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని