Covid Scanners: స్కానర్లతో కరోనా గుర్తింపు..!

‘ఫేషియల్‌ స్కానర్ల’తో వైరస్‌ సోకినవారిని గుర్తించేందుకు అబుదాబి ప్రభుత్వం నూతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది.

Published : 29 Jun 2021 00:04 IST

అందుబాటులోకి తెచ్చిన అబుదాబి

అబుదాబి: కరోనా వైరస్‌ సోకిన వారిని వీలైనంత తొందరగా గుర్తించే విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారిని తేలికగా గుర్తించే సాంకేతికతను అబుదాబి అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలైన విమానాశ్రయాలు, మాల్స్‌లో ‘ఫేషియల్‌ స్కానర్ల’తో వైరస్‌ సోకినవారిని గుర్తించేందుకు ఏర్పాట్లు చేసింది. వేల మందిపై జరిపిన పరిశీలనలో దాదాపు 90శాతానికిపైగా కచ్చితత్వంతో ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారిని స్కానర్లు గుర్తిస్తున్నాయని అబుదాబి ఆరోగ్యశాఖ వెల్లడించింది.

93శాతం కచ్చితత్వంతో..

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ముందుగా వైరస్‌ సోకిన వారిని గుర్తించడమే అత్యంత కీలకం. ఇందుకోసం ఇప్పటికే ఆర్‌టీ-పీసీఆర్‌ (RTPCR) తోపాటు అత్యంత వేగంగా ఫలితాన్నిచ్చే కొవిడ్‌ యాంటీజెన్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. వీటికంటే మరింత వేగంగా వైరస్‌ సోకిన వారిని గుర్తించేందుకు అబుదాబి ఆరోగ్య అధికారులు నూతన సాంకేతికతను వినియోగించారు. ఇందుకోసం వ్యక్తి శరీరంపై కరోనా వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ కణాలను గుర్తించే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ వేవ్స్‌ (Electromagnetic Waves) సాంకేతికతను ఉపయోగించారు. అబుదాబికి చెందిన ఈడీఈ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతను ప్రయోగాల్లో భాగంగా 20వేల మందిపై పరీక్షించారు. అందులో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవారిని 93శాతం కచ్చితత్వంతో స్కానర్లు గుర్తించినట్లు అబుదాబి ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో కీలకం..

రద్దీ ప్రదేశాల్లో ఈ స్కానర్లను వినియోగించడం ద్వారా వైరస్‌ అనుమానితులను ప్రాథమికంగా పసిగట్టవచ్చు. అనంతరం వారికి కొవిడ్‌ పరీక్షలు చేపట్టడం ద్వారా వైరస్‌ సోకిందా? లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చని అబుదాబి ఆరోగ్య అధికారులు వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తిని నియంత్రణలో ఈడీఈ స్కానర్ల సాంకేతికత ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కరోనా సేఫ్‌ జోన్లను వర్గీకరించడంలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. అందుకే వీటిని షాపింగ్‌ మాల్స్‌, విమానాశ్రయాలతో పాటు ఇతర రద్దీ ప్రదేశాల్లో వినియోగిస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని