Rashtrapatni Remark: నోరు జారా.. నన్ను క్షమించండి: రాష్ట్రపతికి అధీర్‌ లేఖ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును క్షమాపణ (Apology) కోరుతూ కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ తాజాగా లేఖ రాశారు.

Published : 29 Jul 2022 21:19 IST

దిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును (Droupadi Murmu) ఉద్దేశించి ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును క్షమాపణ (Apology) కోరుతూ కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ తాజాగా లేఖ రాశారు. కేవలం నోరుజారడం వల్లే అలా జరిగిందని అందులో పేర్కొన్నారు. రాష్ట్రపతిపై వ్యాఖ్యలకు లిఖితపూర్వంగా వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశంతో పాటు అధికార పక్షం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత క్షమాపణ లేఖ రాశారు.

‘మీరు చేపట్టిన రాష్ట్రపతి పదవిని ప్రస్తావిస్తూ తప్పు పదాన్ని ఉపయోగించినందుకు విచారం వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాస్తున్నా. కేవలం నోరుజారడం వల్లే అలా జరిగిందని కచ్చితంగా చెప్పగలను. ఈ సందర్భంగా మిమ్నల్ని క్షమాపణ కోరుతున్నా. అంగీకరించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొంటూ కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధురి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు.

కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దేశాధినేతగా బాధ్యతలు చేపట్టిన గిరిజన మహిళను కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అవమానించిందని ఆరోపించింది. పొరపాటున అలా అనలేదని.. కావాలనే కాంగ్రెస్‌ ఈ విధమైన వ్యాఖ్యలు చేసిందని దుయ్యబట్టింది. ఈ నేపథ్యంలో అధీర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని భాజపా డిమాండ్‌ చేసింది. ఇదే విషయంపై పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేగడంతోపాటు పార్లమెంటు వెలుపల కూడా అధికార, విపక్ష సభ్యుల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ అధీర్‌ రంజన్‌ రాష్ట్రపతికి  లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని