Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం

రష్యాలో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయాణికులు ఎట్టకేలకు తమ గమ్యస్థానానికి బయల్దేరారు. ప్రత్యేక విమానంలో వారిని ఎయిరిండియా (Air India) అమెరికాకు పంపించింది.

Updated : 08 Jun 2023 16:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ (Delhi) నుంచి బయల్దేరి సాంకేతిక లోపం కారణంగా రష్యా (Russia)లో దిగిన ఎయిరిండియా (Air India) విమాన ప్రయాణికులు ఎట్టకేలకు అమెరికా (USA) బయల్దేరారు. దాదాపు 39 గంటల తర్వాత ముంబయి నుంచి వెళ్లిన ప్రత్యేక విమానం.. గురువారం ఉదయం ఆ ప్రయాణికులను తీసుకుని శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco)కు టేకాఫ్‌ అయ్యింది. ఈ విషయాన్ని ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది.

దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా AI173 విమానంలోని ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది రష్యాలో అత్యవసరంగా దిగిన విషయం తెలిసిందే. జూన్‌ 6వ (మంగళవారం) తేదీన ఉదయం 4.05 గంటలకు దిల్లీ నుంచి బయల్దేరిన ఈ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు.. వెంటనే విమానాన్ని రష్యా వైపు మళ్లించారు. మధ్యాహ్నం 2.10 గంటలకు ఈ విమానాన్ని మదగన్‌ (Magadan) ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దించారు. ఈ విమానంలో 216 మంది ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు.

అయితే ఈ మగదన్‌ ప్రాంతం రష్యా రాజధాని మాస్కోకు 10వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో హోటళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులను డార్మిటరీల్లో ఉంచారు. అదే సమయంలో ప్రయాణికులను వీలైనంత త్వరగా అక్కడి నుంచి తరలించేందుకు ఎయిరిండియా (Air India) ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే, కొన్ని అనుమతులు ఇతరత్రా కారణాల వల్ల ఈ ప్రయత్నాలు కొంత ఆలస్యమయ్యాయి. చివరకు బుధవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ఎయిరిండియా ప్రత్యేక విమానం ముంబయి నుంచి మగదన్‌కు బయలుదేరింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విమానం రష్యా చేరుకుంది. అనంతరం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రయాణికులను తీసుకుని ఈ విమానం శాన్‌ఫ్రాన్సిస్కో బయల్దేరింది. అలా దాదాపు 39 గంటల నిరీక్షణ తర్వాత ఈ ప్రయాణికులు ఎట్టకేలకు తమ గమ్యస్థానాలకు బయల్దేరారు.

మగదన్‌లో నిలిచిన సమయంలో తాము కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. సరైన వసతులు లేని కారణంగా ఈ ప్రయాణికులను బస్సుల్లో పలు ప్రాంతాలకు తరలించారు. అయితే లగేజీలు విమానంలో ఉండటంతో వీరు ఇబ్బందులు పడ్డారు. ఆహారం, ఔషధాలు లేకపోవడంతో పాటు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నామని తెలిపారు.

అమెరికా పౌరులు తక్కువే..

కాగా.. రష్యాలో దిగిన ఈ విమానంపై అమెరికా (USA) స్పందించింది. పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ఈ విమానంలో 50 కంటే తక్కువ మందే అమెరికా పౌరులు ఉన్నట్లు వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని