ఆ సమస్య ఒక్క రోజులో పరిష్కారమయ్యేది కాదు!

కాలుష్య సమస్య ఒక్క రోజులో పరిష్కారమయ్యేది కాదని కేంద్ర వాతావరణ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. దాన్ని ఎదుర్కొనడానికి నిరంతర ప్రయత్నాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఫేస్‌బుక్‌ వేదికగా నిర్వహించిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో జావడేకర్‌ వెల్లడించారు.

Published : 19 Oct 2020 02:19 IST

దిల్లీ: కాలుష్య సమస్య ఒక్క రోజులో పరిష్కారమయ్యేది కాదని కేంద్ర వాతావరణ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. దాన్ని ఎదుర్కోవడానికి నిరంతర ప్రయత్నాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఫేస్‌బుక్‌ వేదికగా నిర్వహించిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో జావడేకర్‌ మాట్లాడారు. ‘దేశంలో గాలి కాలుష్యానికి ట్రాఫిక్‌, కర్మాగారాలు, దుమ్ము, పంట వ్యర్థాల దహనం ప్రధాన కారణాలు. ఈ కాలుష్య సమస్యను కేవలం ఒకే రోజులో పరిష్కరించలేం. దీన్ని ఎదుర్కొనడానికి నిరంతర ప్రయత్నాలు అవసరం. రాబోయే రోజుల్లో విద్యుత్‌ వాహనాల హవా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 2లక్షలకు పైగా ఈవీలు వాడుకలో ఉన్నాయి. నేను కూడా విద్యుత్‌ వాహనాన్నే ఉపయోగిస్తున్నాను. ఇంటి వద్దే ఛార్జింగ్‌ చేసుకుంటా. ఈవీల ద్వారా వాహన కాలుష్యాన్ని నివారించవచ్చు’ అని జావడేకర్‌ వెల్లడించారు. 

‘ఇప్పటికే వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం బీఎస్‌6 వాహనాల్ని అమలులోకి తెచ్చింది. ఈ వాహనాల ద్వారా 60శాతం కాలుష్యం తగ్గుతుంది. ‘బ్యాడ్‌ ఎయిర్‌ డేస్‌’ సంఖ్య 2016లో ఏడాదికి 250 రోజులు ఉండగా.. 2020లో అది 180కి చేరింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రజలు కీలక పాత్ర పోషించగలరు. కాబట్టి వివిధ నగరాల్లో కాలుష్య స్థాయుల్ని పర్యవేక్షించడానికి ప్రజలు సమీర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరుతున్నా’అని జావడేకర్‌ స్పష్టం చేశారు.

శీతాకాలం రానున్న నేపథ్యంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఇప్పటికే 50 ప్రత్యేక బృందాలను నియమించినట్లు ప్రకాశ్‌ జావడేకర్‌ ఇటీవల తెలిపారు.  ఈ బృందాలు దేశరాజధాని దిల్లీ సహా చుట్టు పక్కల జిల్లాల్లో కాలుష్యంపై దృష్టి సారించనున్నాయని అన్నారు. దిల్లీలో 95శాతం కాలుష్యం స్థానిక కారణాల వల్లే వస్తోందని పేర్కొన్నారు. కాగా దేశరాజధానిలో గాలి కాలుష్య నివారణకు కేంద్రం, దిల్లీ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ గత వారం రోజులుగా గాలి నాణ్యత క్షీణిస్తుండడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని