బికినీపై కర్ణాటక జెండా.. అమెజాన్‌పై ఫైర్‌!

Amazon under fire: కర్ణాటక జెండా రంగులతో కూడిన బికినీ విక్రయానికి ఉంచిన అమెజాన్‌ కన్నడిగుల ఆగ్రహానికి గురైంది.

Published : 06 Jun 2021 17:40 IST

బెంగళూరు: మరో అంతర్జాతీయ కంపెనీ కన్నడిగుల ఆగ్రహానికి గురైంది. కర్ణాటక జెండా రంగులు, చిహ్నంతో కూడిన బికినీని విక్రయించినందుకు గానూ అమెజాన్‌ తాజాగా వివాదంలో చిక్కుకుంది. అమెజాన్‌కు చెందిన కెనడా వెబ్‌సైట్‌లో ఈ తరహా బికినీ వెలుగుచూడడం ఈ వివాదానికి కారణం. మొన్న వికారమైన భాషగా కన్నడను పేర్కొనడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న గూగుల్‌ ఉదంతం మరవకముందే ఈ వ్యవహారం వెలుగుచూడడం గమనార్హం.

బికినీ వ్యవహారంపై కర్ణాటక మంత్రి అరవింద్‌ లింబావాలీ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ విషయంలో అమెజాన్‌ కెనడా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా మల్టీ నేషనల్‌ కంపెనీలు చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం అమెజాన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. తాజా వివాదంపై అమెజాన్‌ స్పందించకపోయినప్పటికీ.. జెండా రంగులు, చిహ్నంతో కూడిన బికినీని మాత్రం తన సైట్‌ నుంచి తొలగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని