Chhattisgarh: సీఎంగా విష్ణుదేవ్‌.. ప్రచారంలోనే అమిత్‌ షా ‘హింట్‌’ ఇచ్చారా?

ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్‌ సాయ్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఎన్నికల ప్రచార సభలో అమిత్‌ షా (Amit Shah) చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Published : 11 Dec 2023 02:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విష్ణుదేవ్‌ సాయ్‌ను (Vishnu Deo Sai) ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ భాజపా నిర్ణయం తీసుకుంది. ఆదివారం సమావేశమైన భాజపా ఎమ్మెల్యేలు.. శాసనసభా పక్ష నేతగా సాయ్‌ను ఎన్నుకోవడంతో వారం రోజులుగా కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. సాయ్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే (రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత).. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తామంటూ ఎన్నికల ప్రచార సభలో అమిత్‌ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కుంకురీ నియోజకవర్గం నుంచి విష్ణుదేవ్‌ సాయ్‌ పోటీ చేశారు. ఈ క్రమంలో పోలింగ్‌కు ముందు అక్కడ నిర్వహించిన ప్రచార సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుదేవ్‌ సాయ్‌ను గెలిపించాలని స్థానిక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘మీరు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి.. మేము ఆయన్ను పెద్ద వ్యక్తిని చేస్తాం’ అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తామనే కోణంలో మాట్లాడారు. షా చెప్పినట్లుగానే కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే యుడి మింజ్‌పై 25వేల మెజార్టీతో విష్ణుదేవ్‌ గెలుపొందారు. అనంతరం భాజపాలోకి అధికారంలోకి రావడం.. షా చెప్పినట్లుగానే విష్ణుదేవ్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Freebies: ‘ఉచిత’ పథకాలపై ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ కీలక వ్యాఖ్యలు

మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చడంతోపాటు ప్రతిఒక్కరి విశ్వాసాన్ని పొందేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రిగా ఎన్నికైన విష్ణుదేవ్‌ సాయ్‌ పేర్కొన్నారు. 18లక్షల మందికి ఆవాసాన్ని కల్పించడమే తన తొలి ప్రాధాన్యమని అన్నారు. ఇదిలాఉంటే, ఛత్తీస్‌గఢ్‌లో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను 54 చోట్ల విజయం సాధించిన భాజపా.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 35 స్థానాల్లో గెలుపొంది అధికారానికి దూరమైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని