తప్పిపోయిన ఏనుగు పిల్ల.. తల్లితో కలిపిన రెస్క్యూ టీం.. ఆనంద్‌ మహీంద్రా రియాక్షన్‌ ఇదే!

తమిళనాడు పొల్లాచ్చిలోని అన్నామలై టైగర్‌ రిజర్వ్‌లో జరిగిన ఓ సంఘటనను ఐఏఎస్‌ అధికారిణి తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా పంచుకున్నారు. దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు.

Updated : 10 Feb 2024 11:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తల్లి కోసం అడవి అంతా తిరుగుతోంది ఓ ఏనుగు పిల్ల. దీన్ని గమనించిన అటవీశాఖ అధికారులు ఎలాగైనా ఆ ఏనుగు పిల్లను తల్లి వద్దకు చేర్చాలనుకున్నారు. దాని కోసం ఎంతో శ్రమించి, చాకచక్యంగా తల్లి గూటికి చేర్చారు. ఈ విషయాన్ని ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహు తన ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకున్నారు. దీనిపై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) కూడా స్పందించారు.

‘తమిళనాడు పొల్లాచ్చికి సమీపంలోని అన్నామలై టైగర్‌ రిజర్వ్‌లో తప్పిపోయిన ఏనుగు పిల్లను తల్లి గూటికి చేర్చటానికి ఎంతో శ్రమించారు అటవీ శాఖ అధికారులు. డ్రోన్లు, అనుభవజ్ఞులైన అటవీ అధికారుల సాయంతో చిన్న ఏనుగు పిల్లను గుర్తించారు. ఆ సమయంలో ఆ ఏనుగు పిల్ల తన తల్లి కోసం వెతుకుతోంది. సహాయక బృందం ఎంతో సురక్షితంగా దాన్ని తల్లి వద్దకు చేర్చారు. ఈ ఘటనతో ఏడాది ఎంతో ఆనందంతో ముగుస్తోంది’ అంటూ ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహు తన ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకున్నారు.

సంబంధిత వీడియోను కూడా ఐఏఎస్‌ అధికారిణి ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకుంది. అతి తక్కువ సమయంలోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు అటవీ అధికారులపై ప్రశంసల జల్లులు కురిపించారు. ‘మీరు చేసింది నిజంగా అద్భుతమైన పని. జంతువులను సంరక్షించటం కోసం మీరు నిజంగా చాలా శ్రమిస్తున్నారు’ అంటూ యూజర్లు కామెంట్‌ చేశారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే  పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కూడా దీనిపై స్పందించారు. ‘ రెస్క్యూ టీమ్‌ చేసిన ప్రయత్నానికి అభినందనలు. మానవులు ఈ గ్రహంపై శాంతియుతంగా ఇతర జీవులతో కలిసి జీవించేందుకు దయా గుణం, సాంకేతికత అనేవి శక్తివంతమైన సాధనాలని మీరు నిరూపించారు. ఈ అద్భుతమైన సంఘటనను ఒక లఘు చిత్రంగా రూపొందిస్తే ఎంతో బాగుంటుంది’ అని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని