Anand Mahindra: బై బై కాలీ పీలి ట్యాక్సీ.. మీకిదే నా వీడ్కోలు: ఆనంద్‌ మహీంద్రా

ముంబయి వాసులకు సుమారు ఆరున్నర దశాబ్దాలపాటు సర్వీసులను అందించిన కాలీ పీలి ట్యాక్సీలు ఇకపై కనుమరుగుకానున్నాయి. ఈ క్రమంలో వాటితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు. 

Published : 30 Oct 2023 13:49 IST

ముంబయి: ఈ తరం వారికి ట్యాక్సీ సర్వీస్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఓలా, ఉబర్‌లే. కానీ, పాత తరం ముంబయి (Mumbai) వాసులకు మాత్రం ట్యాక్సీ అనగానే నలుపు, పసుపు రంగులో ఉండే ప్రీమియర్‌ పద్మిని (Premier Padmini) కార్లు కళ్ల ముందు కదలాడుతాయి. సుమారు ఆరున్నర దశాబ్దాలపాటు ముంబయి రోడ్లపై ఠీవిగా ప్రయాణించిన ఈ కార్లు ఇకపై కనుమరుగు కానున్నాయి. సోమవారం నుంచి ఈ కార్ల సర్వీసులు నిలిచిపోయాయి. కాలీ పీలి ట్యాక్సీగా (నలుపు, పసుపు ట్యాక్సీ) (Kaali Peeli Taxi) పేరొందిన ప్రీమియర్‌ పద్మిని కార్ల శ్రేణిలో చివరి మోడల్‌ తయారై 20 ఏళ్లు పూర్తి కావడంతో, నిబంధనల ప్రకారం ఈ కార్లను నిలిపివేయాలని నిర్ణయించారు.

తాజాగా ఈ ట్యాక్సీ సర్వీసులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు నుంచి ముంబయి రోడ్లపై ప్రీమియర్‌ పద్మిని ట్యాక్సీలు కనిపించవు. అవి గొప్పవి కాకపోవచ్చు, సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు, ఎక్కువగా శబ్దం చేయొచ్చు, లగేజ్‌ సామర్థ్యం కూడా పెద్దగా లేదు.. కానీ పాత తరం వారికి టన్నుల కొద్దీ జ్ఞాపకాలను మిగిల్చాయి. ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణికులను తీసుకెళ్లాయి. కాలీ పీలి ట్యాక్సీలకు ఇదే నా వీడ్కోలు. మీతో సమయం గడిపినందుకు ధన్యవాదాలు’’ అంటూ మహీంద్రా ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ప్రీమియర్‌ పద్మిని ట్యాక్సీ సర్వీసులతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ‘‘చాలా సినిమాల్లో చూశాం. ముంబయి రోడ్లపై ఎంతో ఠీవిగా తిరిగేవి. వాటిని ఎంతో మిస్‌ అవుతున్నాం’’, ‘‘ముంబయికి గర్వకాణంగా ఉండేవి. ఇకపై చరిత్రలో జ్ఞాపకంగా ఉండనున్నాయి’’ అని కామెంట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని