Anand Mahindra - Shah Rukh Khan: ‘జీవితం చాలా చిన్నది సర్‌..’ మహీంద్రా ట్వీట్‌కు షారుక్‌ రిప్లై

షారుక్‌ వయసు పెరగడం లేదని ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్‌కు.. ‘జీవితం చాలా చిన్నది సర్‌.. ఏది కావాలన్నా ప్రయ్నతించి, వినోదం పొందాల్సిందే’ అంటూ షారుక్‌ ఇచ్చిన రిప్లై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Published : 03 Aug 2023 01:37 IST

ముంబయి: ఇద్దరు సెలబ్రిటీల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా జరిగే సంభాషణలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra), బాలీవుడ్ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)కు మధ్య జరిగిన ట్వీట్‌లు వైరల్‌గా మారాయి. కొద్దిరోజుల క్రితం షారుక్‌ కొత్త చిత్రం జవాన్‌ (Jawan) నుంచి జిందాబందా పాట విడుదలైన సంగతి తెలిసిందే. అందులో షారుఖ్‌ లుక్‌ చూసి ఆయన వయసుపై ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు. ‘‘ఈ హీరో వయస్సు 57 ఏళ్లా?ఆయన వయసు పెరుగుదల గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉంది. ఇతరుల కంటే ఆయన పది రెట్లు ఎక్కువ యంగ్‌గా ఉన్నారు’’ అని ట్వీట్ చేశారు. 

మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌కు షారుక్‌ బదులిచ్చారు. ‘‘ జీవితం చాలా చిన్నది సార్‌. వేగంగా జరిగిపోతుంది. ఏది కావాలన్నా ప్రయత్నించి, వినోదాన్ని పొందండి. అది నవ్వు, ఏడుపు, డ్యాన్స్‌, ఎగరడం.. ఇలా ఏదైనా. వాటితో చుక్కల్లో విహరిద్దాం. కొన్ని క్షణాల సంతోషం కోసం కలలు కనండి’’ అంటూ షారుక్‌ ట్వీట్ చేశాడు. 

ఈ ట్వీట్‌ సంభాషణ చూసిన నెటిజన్లు కామెంట్ల ద్వారా తమ స్పందన తెలియజేస్తున్నారు. ‘షారుఖ్‌ ఎంతో కష్టపడే వ్యక్తి, ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఫిట్‌గా ఉన్నారు’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘మహీంద్రా సర్‌.. ఆయన ఇతరుల కంటే పది రెట్లు ఫిట్‌గా, ఉత్సాహంగా ఉంటారు. అచ్చం మహీంద్రా ఉత్పత్తుల మాదిరే’ అని మరో యూజర్‌ కామెంట్ చేశారు. షారుఖ్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ చిత్రం సెప్టెంబరు 7న విడుదల అవుతోంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించాడు. నయనతార, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని