Amit Shah: ‘మంత్రి గారూ.. ఇక ఆపుతారా..?’: అనిల్‌ విజ్‌పై అమిత్‌ షా అసహనం..!

‘చింతన్‌ శివిర్‌’కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హరియాణా తరఫున మంత్రి అనిల్ విజ్ ప్రసంగించారు.

Updated : 28 Oct 2022 10:47 IST

సూరజ్‌కుండ్‌: పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో హరియాణా హోం మంత్రి అనిల్‌ విజ్‌ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ‘మీ ప్రసంగం ఇక ఆపండి’ అని స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆయన్ను హెచ్చరించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

‘విజన్‌ 2047’కి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేయడమే ప్రధాన అజెండాగా హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో కేంద్ర హోం శాఖ నేతృత్వంలో ‘చింతన్‌ శివిర్‌’ను నిర్వహిస్తున్నారు. దీనికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రం తరఫున మంత్రి అనిల్ విజ్ ప్రసంగించారు. ఆయనకు ఇచ్చిన సమయం ఐదు నిమిషాలు. అయితే ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే అది కాస్తా దారిమళ్లింది. హరియాణా చరిత్ర, హరిత విప్లవం, ఆటల్లో ఆ రాష్ట్రం సాధించిన విజయాలు, ఆయన ప్రతివారం నిర్వహించే గ్రీవెన్స్ డే గురించి మాట్లాడుకుంటూ పోయారు. ఆయనకు కొంచెం దూరంలో కూర్చున్న అమిత్‌ షా ఆయన మాటలను జాగ్రత్తగా విన్నారు. కానీ అప్పటికే ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దాంతో ఇక ముగించాలని ఆయనకు సూచించారు. కానీ అనిల్‌ మాత్రం మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత షా మైక్‌ తట్టి శబ్దం చేశారు. అయినా లాభం లేకపోయింది. 

‘అనిల్‌ జీ.. మీకిచ్చిన ఐదు నిమిషాలు పూర్తయింది. మీరు ఇప్పటికే ఎనిమిదిన్నర నిమిషాలు మాట్లాడారు. మీ ప్రసంగాన్ని ముగించండి. సుదీర్ఘంగా మాట్లాడేందుకు ఇది వేదిక కాదు’ అని కాస్త గట్టిగానే చెప్పారు. అయితే రాష్ట్ర మంత్రి మరికొంచెం సమయం అడిగారు. అందుకు అనుమతివ్వగానే.. విజయాల చిట్టా మొదలుపెట్టారు. దీంతో కేంద్రమంత్రి అసహనానికి  గురయ్యారు. ‘అనిల్‌జీ.. నన్ను క్షమించండి. ఇది సరికాదు. ముగించండి’ అని చెప్పారు. అయినా.. ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో ‘ఇక చాలు.. ఇక ముందుకెళ్దాం’ అని మరో అవకాశం ఇవ్వకుండా అమిత్‌ షా ఆయన ప్రసంగాన్ని కట్‌ చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ అప్రమత్తమయ్యారు. ఆయనికిచ్చిన సమయంలో కేవలం మూడు నిమిషాలు మాత్రమే వినియోగించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని