Asaduddin Owaisi: తాజ్‌మహల్‌ నిర్మించకపోతే లీటరు పెట్రోల్‌ రూ.40కే వచ్చేది: ఒవైసీ

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షాజహాన్‌ తాజ్‌మహల్‌ నిర్మించి ఉండకుంటే.......

Updated : 05 Jul 2022 18:31 IST

దిల్లీ: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షాజహాన్‌ తాజ్‌మహల్‌ నిర్మించకపోతే.. దేశంలో ఇప్పుడు పెట్రోలు లీటరు రూ.40కే వచ్చేదంటూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) విమర్శిస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఓ బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని సమస్యలకు మోదీ ప్రభుత్వం మైనారిటీలను, మొఘలులను కారకులుగా చూపిస్తోందని మండిపడ్డారు. ‘దేశంలోని యువతకు ఉపాధి లేదు. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. లీటరు డీజిల్‌ను రూ.102కు విక్రయిస్తున్నారు. వీటన్నింటికి కారకుడు ఔరంగజేబు‌. మోదీ కాదు. దేశంలో నిరుద్యోగానికి కారకుడు అక్బర్‌. పెట్రోల్‌ రేటు రూ.115కు పెరగడానికి తాజ్‌మహల్‌ నిర్మించిన వ్యక్తి కారకుడు. ఆనాడు తాజ్‌ మహల్‌ నిర్మించి ఉండకుంటే నేడు పెట్రోల్‌ రూ.40కే లభించేంది’ అంటూ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

దేశంలో సమస్యలు ఎదురైనప్పుడు మైనారిటీ వర్గాలు, మొఘలులే కారణమంటూ విమర్శించడం కేంద్రానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. పాకిస్థాన్‌తో కానీ, మొఘలులతో కానీ తమకు ఎలాంటి పనిలేదని, తాము భారతీయులమన్నారు. జిన్నా ప్రతిపాదనను తిరస్కరించి, భారత్‌లో ఉండేందుకే మొగ్గుచూపామని గుర్తుచేశారు. 75 ఏళ్లుగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని.. ఈ దేశంలోనే జీవించి, ఈ దేశంలోనే మరణిస్తామని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని