Himanta sarma: అస్సాంలో ‘అఫ్‌స్పా’ ఉపసంహరణపై సీఎం హిమంత కీలక వ్యాఖ్యలు!

అస్సాంలో వివాదాస్పద అఫ్‌స్పా చట్టాన్ని ఈ ఏడాది చివరికల్లా తమ రాష్ట్రం నుంచి ఉపసంహరించుకొనే అవకాశం ఉన్నట్టు సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు.

Published : 22 May 2023 21:47 IST

గువాహటి: అస్సాం(Assam)లో వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA-అఫ్‌స్పా) ఉపసంహరణ అంశంపై సీఎం హిమంత బిశ్వశర్మ(Himanta biswa sarma) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాన్ని నవంబర్‌ నెలాఖరు కల్లా ఉపసంహరించుకొనే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. 2023 చివరి నాటికి అస్సాం నుంచి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు కమాండంట్స్‌ కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) స్థానంలో అస్సాం పోలీసు బెటాలియన్‌లతో భర్తీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. తమ పోలీసు బలగాలకు శిక్షణ ఇవ్వడానికి మాజీ సైనిక సిబ్బందిని నియమించుకుంటామని చెప్పారు. 

ప్రస్తుతం అస్సాంలోని ఎనిమిది జిల్లాలు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం- 1958 లేదా అఫ్‌స్పా పరిధిలోనే ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం ప్రత్యేక భద్రతా దళాలకు కల్లోలిత ప్రాంతాల్లో ఎలాంటి వారెంట్లు లేకుండానే సోదాలు జరపడం, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, అవసరమైతే కాల్పులు జరపడం వంటి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఈ చట్టం కింద ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడినా- వారిపై చర్యలకు ఉపక్రమించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి ఉండాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే, అఫ్‌స్పా అమలులో ఉన్నచోట ఆత్యయిక స్థితి ఉన్నట్లే. అయితే, ఈ అధికారాలను దుర్వినియోగపరుస్తూ సామాన్య పౌరులపై దారుణాలకు పాల్పడుతున్నట్టుగా అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి.  సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే ఈ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మణిపూర్‌కు చెందిన ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని