Nitin Gadkari: అలా అయితేనే స్వయం సమృద్ధి భారత్‌ సాధ్యం: గడ్కరీ

Nitin Gadkari: ఆత్మనిర్భర్‌ భారత్‌పై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అసమానతలను రూపుమాపాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Published : 23 Jun 2023 16:13 IST

ముంబయి: సామాజిక ఆర్థిక అసమానతలకు స్వస్తి చెబితేనే ‘స్వయం సమృద్ధి భారత్‌ (Atmanirbhar Bharat)’ సాధ్యమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. వ్యవసాయ, గ్రామీణ, గిరిజన రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని తెలిపారు. జీడీపీలో వీటి వాటా ప్రస్తుతం ఉన్నదానితో పోలిస్తే రెట్టింపు కావాల్సిన అవసరం ఉందన్నారు. 2020లో కేంద్ర ప్రభుత్వం ‘స్వయం సమృద్ధి భారత్‌’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ గవర్నర్లపై ప్రచురించిన ఓ పుస్తకాన్ని విడుదల చేస్తూ గడ్కరీ (Nitin Gadkari) శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

కాలం గడుస్తున్న కొద్దీ సామ్యవాద (socialist), కమ్యూనిస్టు సిద్ధాంతాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయని గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. పార్లమెంటులో సీపీఐ, సీపీఐ(ఎం) సభ్యుల సంఖ్య క్రమంగా పడిపోయిందని తెలిపారు. భాజపా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాలో పర్యటించిన రోజులను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. చైనాలో కేవలం జెండాలు మాత్రమే ఎరుపు రంగులో మిగిలిపోయాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధి కోసం పూర్తిగా మార్కెట్‌ కేంద్రీకృత విధానాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పరోక్షంగా ఆర్థిక విధానాల్లో సామ్యవాదానికి స్వస్తి పలికారని అభిప్రాయపడ్డారు.

భారత్‌ను ఆర్థిక శక్తిగా మార్చే దిశగా విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. ఈ క్రమంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఫలితాలిచ్చే రంగాలను గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. కేవలం ఆర్థికపరమైన వ్యవహారాలపైనే కాకుండా పనితీరుపై కూడా ఆడిట్‌ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పరిమిత స్థాయిలో ఆర్థిక వనరులున్న సమయంలో ‘పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య’ విధానాన్ని అవలంబించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని