VACCINE: మరో శుభవార్త

కరోనా కష్ట కాలంలో మరో శుభవార్త. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే.  18 సంవత్సరాలు

Published : 27 Jun 2021 17:09 IST

న్యూదిల్లీ: కరోనా కష్ట కాలంలో మరో శుభవార్త. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే.  18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు 18 సంవత్సరాలలోపు వయసున్న వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రయోగాలు, క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 12-18 ఏళ్ల వారికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ అరోరా తెలిపారు. జైడస్‌ క్యాడిలా టీకా ట్రయల్స్‌ దాదాపు పూర్తి అయ్యాయని ఆగస్టు కల్లా 12-18 ఏళ్ల వారికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశా భావం వ్యక్తం చేశారు. దేశమంతా వ్యాక్సినేషన్‌కు 6-8 నెలల సమయం పట్టనుండగా, థర్డ్‌వేవ్‌ ఆలస్యంగానైనా రావొచ్చని ఐసీఎంఆర్‌ అంటోందన్నారు. రోజుకు కోటి టీకాలు వేయాలనేదే తమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

చిన్నారులకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే అదో మైలురాయి

ప్రస్తుతం పలు దేశాల్లో చిన్నారులకు వ్యాక్సిన్‌ అందిస్తుండగా, మన దేశంలో కూడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే అదొక కీలకమైన మైలురాయి అవుతుందని ఎయిమ్స్‌ చీఫ్‌ రణదీప్‌ గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాఠశాలలను పూర్తి స్థాయిలో తెరిచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యార్థుల చదువుకు మార్గం సుగమమవడానికి తోడ్పడుతుందని అన్నారు.

ఇప్పటికే చిన్నారుల కోసం భారత్‌ బయోటెక్‌ ఓ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తోంది. 2 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఈ వ్యాక్సిన్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే రెండు, మూడో దశ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. ఈ వ్యాక్సిన్‌ సెప్టెంబరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రణదీప్‌ గులేరియా పై విధంగా స్పందించారు. అంతకన్నా ముందే భారత్‌లో ఫైజర్‌కు అనుమతి రావడం, జైడస్‌ క్యాడిలా కూడా వ్యాక్సిన్‌ తీసుకువస్తే వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అవకాశాలు విస్తృతమవుతాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని