‘క్షణాల్లో నిన్ను ఉగ్రవాదిగా ప్రకటించగలను’.. టీచర్‌కు పోలీసు అధికారి బెదిరింపులు

తన సమస్య చెప్పుకోవడానికి ఓ ఉపాధ్యాయుడు చెప్పిన సమయానికి కాకుండా మూడు రోజులు ఆలస్యంగా వచ్చాడని ఆగ్రహానికి గురైన ఓ పోలీసు అధికారి..అతడి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. క్షణాల్లో నిన్ను ఉగ్రవాదిగా ప్రకటించగలనని బెదిరింపులకు పాల్పడ్డాడు.

Updated : 04 May 2023 16:46 IST

పట్నా: తన సమస్యను వెల్లడించుకోవడానికి వచ్చిన ఓ ఉపాధ్యాయుడి పట్ల ఓ పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించిన ఘటన బిహార్‌ (Bihar)లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా వచ్చాడని ఆగ్రహానికి గురైన ఆ పోలీసు అధికారి బాధితుడిపై దుర్భాషలాడాడు. అంతేకాక అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్షణాల్లో నిన్ను ఉగ్రవాది (Terrorist)గా ప్రకటించగలనని బెదిరింపులకు పాల్పడ్డాడు. సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో విషయం వెలుగు చూసింది.

ఓ వివాదానికి సంబంధించి తన సమస్యను విన్నవించుకోవడానికి ఓ ఉపాధ్యాయుడు తన కుటుంబసభ్యులతో పట్నా (Patna)లోని ఉన్న జాముయి (Jamui) పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. చెప్పిన సమయానికి కాకుండా మూడు రోజులు ఆలస్యంగా వచ్చాడని ఆగ్రహించిన పోలీసు అధికారి రాజేశ్‌ శరన్‌ బాధితుడి సమస్యను పట్టించుకోకుండా ఇతరుల పేర్లు పిలవడం ప్రారంభించాడు. ఆ ఉపాధ్యాయుడు తన ఆలస్యానికి కారణాలను వెల్లడించినా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోమన్నాడు. వెళ్లకపోతే ‘‘క్షణాల్లో నిన్ను ఉగ్రవాదిగా ప్రకటించగలను’’ అని అతడిని బెదిరించాడు. ఆ అధికారి తన సీటులో నుంచి లేచి ఉపాధ్యాయుడిని బెదిరిస్తున్నట్లు వీడియోలో ఉంది. విషయం వెలుగు చూడటంతో సంఘటనపై విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని