Rahul Gandhi: రెండు హిందుస్థాన్‌లను కోరుకుంటోన్న భాజపా..!

నరేంద్ర మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Published : 16 May 2022 16:18 IST

ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించిన రాహుల్‌ గాంధీ

జైపుర్‌: నరేంద్ర మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. యూపీఏ హయాంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తే భాజపా మాత్రం దాన్ని పూర్తిగా బలహీనపరిచిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్న ఆయన, ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరాటమన్నారు. రాజస్థాన్‌లోని బాన్స్‌వారా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ.. ప్రజలను రెండుగా విభజించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

‘రెండు హిందుస్థాన్‌లను సృష్టించాలని భాజపా, ప్రధానమంత్రి మోదీ కోరుకుంటున్నారు. ఒకటి ధనికుల కోసం, మరొకటి పేదలకోసం. ఇద్దరు, ముగ్గురు వ్యాపారవేత్తలుండే ధనికుల కోసం ఒకటైతే, దళితులు, రైతులు, పేదలతోపాటు అణగారిన వర్గాల కోసం మరొకటి. కానీ, కాంగ్రెస్‌ మాత్రం ఒకే హిందుస్థాన్‌ను కోరుకుంటోంది’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు తాము పనిచేస్తుంటే, భాజపా మాత్రం ప్రజల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు.

దేశంలో ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, నిరుద్యోగాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. ‘మన ఆర్థిక వ్యవస్థపై భాజపా ప్రభుత్వం దాడి చేసింది. నోట్లరద్దు, జీఎస్‌టీని సరిగా అమలు చేయకపోవడంతో ఆర్థిక వ్యవస్థ నాశనమయ్యింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు యూపీఏ ప్రభుత్వం కృషి చేస్తే.. నరేంద్ర మోదీ మాత్రం మన ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని