బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లతో ఇమ్యూనిటీ మెరుగు.. భవిష్యత్‌ వేరియంట్లనూ ఎదుర్కొనే సామర్థ్యం!

కొవిడ్‌ మహమ్మారి కొత్త వేరియంట్లతో సవాళ్లు విసురుతుంటే.. మరోవైపు శాస్త్రవేత్తల పరిశోధనలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.

Published : 17 Dec 2021 17:55 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌ మహమ్మారి కొత్త వేరియంట్లతో సవాళ్లు విసురుతుంటే.. మరోవైపు శాస్త్రవేత్తల పరిశోధనలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ ఒక్కటే ఈ మహమ్మారికి విరుగుడని ప్రపంచ దేశాలు భావిస్తుండగా.. వ్యాక్సిన్‌ తీసుకున్నాక కూడా కొందరు కొవిడ్‌ బారిన పడడం (బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్లు) ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇలా బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడడం వల్ల భవిష్యత్‌లో రాబోయే వేరియంట్లను సైతం ఎదుర్కొనే విధంగా మానవ శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందనలు వృద్ధి చెందుతాయని ఓ పరిశోధనలో తేలింది. డెల్టా వేరియంట్‌పై నిర్వహించిన ఈ పరిశోధన జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (JAMA)లో ప్రచురితమైంది.

వ్యాక్సిన్‌ తీసుకున్నాక కరోనా బారిన పడినప్పుడు వ్యాధి నిరోధక ప్రతి స్పందన వేగంగా వృద్ధి చెంది, సార్స్‌కోవ్‌-2 ఇతర మ్యుటేషన్లను సైతం ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందని అమెరికాకు చెందిన ఒరిజాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అధ్యయనంలో పాలుపంచుకున్న పికాడు టఫెస్సే పేర్కొన్నారు. వ్యాక్సిన్లు తీసుకున్నాక కొవిడ్‌ బారిన పడిన వారి నుంచి తీసుకున్న రక్తనమూనాలను పరిశీలించినప్పుడు మెరుగైన రోగనిరోధక ప్రతిస్పందనలను గుర్తించినట్లు తెలిపారు.

ఒకసారి వ్యాక్సిన్‌ వేసుకుని, కొవిడ్‌ బారిన పడితే భవిష్యత్‌లో వచ్చే వేరియంట్లను సైతం సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందని సహ పరిశోధకుడు మార్కెల్‌ కర్లిన్‌ పేర్కొన్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో కొవిడ్‌ ఎపిడమిక్‌ (అంటువ్యాధి)గా మారడానికి ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి ఒమిక్రాన్‌ వేరియంట్‌పై తాము పరిశోధన చేయకపోయినా, ఒకవేళ వ్యాక్సిన్‌ వేసుకున్నాక ఈ వేరియంట్‌ బారిన పడితే భవిష్యత్‌ వేరియంట్లను ఎదుర్కొనే రోగ నిరోధకత లభిస్తుందని పేర్కొన్నారు. మొత్తం 52 మంది నుంచి స్వీకరించిన రక్త నమూనాల ఆధారంగా ఈ పరిశోధన చేపట్టారు. బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్ల వల్ల యాంటీబాడీలు మరిన్ని ఎక్కువ విడుదల అవుతాయని ఈ పరిశోధన అభిప్రాయపడింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ మహమ్మారి అంతానికి వ్యాక్సినే శ్రీరామ రక్ష అని స్పష్టంచేసింది. ఒకసారి వ్యాక్సిన్‌ వేసుకుంటే వైరస్‌ నుంచి రక్షణ పొందినట్లేనని కర్లిన్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని