Drones: డ్రోన్లతో భారత్‌లోకి మాదక ద్రవ్యాలు.. అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌

పాకిస్థాన్‌ నుంచి డ్రోన్లతో భారత్‌లోకి మాదక ద్రవ్యాలు విడిచిపెట్టేందుకు స్మగ్లర్లు చేసిన ప్రయత్నాలను సరిహద్దు భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.

Published : 29 Sep 2023 18:44 IST

చండీగఢ్‌: భారత్‌- పాక్‌ సరిహద్దులో ఒకే రోజు రెండు డ్రోన్లు కలకలం సృష్టించాయి. పాక్‌ వైపు నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిన ఓ డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (BSF) కూల్చివేసింది. ఆ డ్రోన్‌తో పాక్‌ వైపు నుంచి మాదక ద్రవ్యాలను భారత్‌ భూభాగంలోకి విడిచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం పాకిస్థాన్‌ వైపు నుంచి ఓ డ్రోన్‌ భారత భూభాగంలోకి వస్తున్నట్లు గమనించిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది.. వెంటనే అప్రమత్తమై దానిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్‌ నుంచి ఏదో వస్తువు కిందపడిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా.. ఓ బాటిల్‌లో హెరాయిన్‌గా భావిస్తున్న మాదక ద్రవ్యాలు లభ్యమైనట్లు తెలిపాయి. 

అంతకముందు పంజాబ్‌ పోలీసులతో కలిసి బీఎస్‌ఎఫ్‌ సరిహద్దు కంచె వెంబడి ఉన్న పొలాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో కూలిన డ్రోన్‌తోపాటు కూల్‌డ్రింక్‌ బాటిల్‌లో మాదక ద్రవ్యాలు లభ్యమైనట్లు బీఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ రెండు ఘటనల్లో కిలో హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. డ్రోన్లు చైనాలో తయారైనవిగా గుర్తించారు. సరిహద్దు వెంబడి మాదక ద్రవ్యాల సరఫరాను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నామని బీఎస్‌ఎఫ్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో డ్రోన్‌ల ద్వారా జరిగే ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డ్రోన్‌ సాంకేతికత, యాంటీ-డ్రోన్‌ నిపుణులను సరిహద్దుల వెంబడి నియమించనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గతంలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని