Phone Hacking: ఆ హ్యాక్‌ అలర్ట్‌.. నకిలీది కావొచ్చు: విపక్షాల ఆరోపణలపై యాపిల్‌ స్పష్టత

Apple 'hacking' alert row: విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్‌ ఆరోపణలపై యాపిల్‌ స్పందించింది. ఒక్కోసారి తప్పుడు అలర్ట్‌లు కూడా వస్తుంటాయని పేర్కొంది. మరోవైపు, భారత్‌లోనే గాక, 150 దేశాల్లోని ఐఫోన్‌ యూజర్లకు ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చినట్లు తెలిసింది.

Updated : 31 Oct 2023 17:01 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పలువురు విపక్ష ఎంపీల (Opposition MPs) ఐఫోన్ల (iPhones)కు మంగళవారం హ్యాకింగ్‌ అలర్ట్‌ మెసేజ్‌ (Apple 'hacking' alert)లు రావడం తీవ్ర కలకలం రేపింది. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఫోన్‌ హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఆ సందేశం రావడంతో.. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ (Apple) స్పందించింది. అలాంటి హ్యాకింగ్‌ ప్రయత్నం ఏమీ జరగలేదని తెలిపింది. ఇలాంటి నోటిఫికేషన్లు ఒక్కోసారి నకిలీ అలర్ట్‌లు కూడా కావొచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

‘‘ఈ అలర్ట్‌ నోటిఫికేషన్లను నిర్దిష్టంగా అధికారికంగా పనిచేసే హ్యాకర్ల పనిగా ఆపాదించలేం. హ్యాకింగ్‌ చేసేందుకు వారు అధునాతన పద్ధతులను అవలంబిస్తారు.దీనికి అవసరమైన నిధులు, టెక్నాలజీ వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. వారి హ్యాకింగ్‌ దాడులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇలాంటి దాడులను గుర్తించడం అనేది నిఘా సంకేతాలపై ఆధారపడి ఉంటుంది. యాపిల్ ఫోన్లకు వచ్చే అలర్ట్‌ నోటిఫికేషన్లు ఒక్కోసారి నకిలీ హెచ్చరికలు అయి కూడా ఉండొచ్చు. లేదా కొన్ని దాడులను గుర్తించలేం కూడా..!’’ అని యాపిల్‌ (Apple) తమ ప్రకటనలో వెల్లడించింది.

అయితే, విపక్ష ఎంపీలకు నేడు ఆ హ్యాక్‌ అలర్ట్‌ మెసేజ్‌లు ఎందుకు వచ్చాయన్నది చెప్పేందుకు యాపిల్‌ నిరాకరించింది. ‘‘ఈ అలర్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడానికి గల కారణాలను మాత్రం మేం వెల్లడించలేం. ఎందుకంటే.. దాన్ని బయటపెడితే హ్యాకర్లు భవిష్యత్తులో మా నిఘా నుంచి తప్పించుకునే అవకాశముంది’’ అని యాపిల్‌ స్పష్టం చేసింది.

విపక్ష నేతల ఫోన్లకు హ్యాక్ అలర్ట్‌ మెసేజ్‌లు.. కేంద్రంపై ధ్వజం

కాంగ్రెస్‌ నేతలు శశిథరూర్‌, పవన్ ఖేడా, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా సహా పలువురు విపక్ష పార్టీల నేతల ఐఫోన్లకు మంగళవారం ఈ అలర్ట్ మెసేజ్‌ వచ్చింది. దీంతో వారు ఆ స్క్రీన్‌షాట్లను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ.. కేంద్రం తమ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. అయితే, భారత్‌లోనే గాక.. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో పలువురు ఐఫోన్‌ యూజర్లకు ఈ అలర్ట్‌ నోటిఫికేషన్లు వచ్చినట్లు యాపిల్‌ వర్గాలు వెల్లడించాయి.

దర్యాప్తు చేస్తున్నాం: కేంద్రం

కాగా.. ఈ పరిణామాలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పందిస్తూ విపక్షాల ఆరోపణలు కొట్టిపారేశారు. ‘‘ఈ అలర్ట్‌ నోటిఫికేషన్లు భారత్‌లో మాత్రమే గాక, 150 దేశాల్లోని యూజర్లకు వచ్చినట్లు యాపిల్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ఒక్కోసారి నకిలీ అలర్ట్‌లు కూడా వస్తుంటాయని ఆ సంస్థ పేర్కొంది. అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించాం. ఈ మెసేజ్‌లు వచ్చినవారు దర్యాప్తునకు సహకరించాలని కోరుతున్నాం’’ అని కేంద్రమంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని