CEC: ప్రతి ఎన్నిక సమయంలో ‘అగ్ని పరీక్షే’.. సీఈసీ

ఇప్పటివరకు 400 అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) నిర్వహించినప్పటికీ.. ప్రతి ఎన్నిక సమయంలో ఎన్నికల కమిషన్‌(Election Commission) అగ్నిపరీక్షను ఎదుర్కోవాల్సి వస్తోందని సీఈసీ(CEC) రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ఏర్పాట్ల క్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Published : 12 Mar 2023 21:32 IST

బెంగళూరు: ఎన్నికల నిర్వహణ, ఫలితాల పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ.. ప్రతి ఎన్నిక సమయంలోనూ 'అగ్నిపరీక్ష’ను ఎదుర్కోవాల్సి వస్తోందని ఎన్నికల కమిషన్(Election Commission) పేర్కొంది. కర్ణాటక(Karnataka)లో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికల విషయమై పౌరులు ఎన్నికల సంఘాన్ని విశ్వసించవచ్చా? అనే ప్రశ్నకు ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) రాజీవ్ కుమార్(Rajiv Kumar) ఓ మీడియా సమావేశంలో ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

‘దేశంలో అనేక సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, భౌగోళిక సమస్యలు చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కారమయ్యాయి. ప్రజాస్వామ్యం (Democracy)తోనే ఇది సాధ్యమైంది. ఎన్నికల ఫలితాలను ప్రజలు విశ్వసించడం వల్లే ప్రజాస్వామ్యం నిలబడింది. అయినా.. ఇప్పటికీ ప్రతి ఎన్నిక సమయంలో ‘ఈసీ’ అగ్నిపరీక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది’ అని రాజీవ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు.. నకిలీ కథనాలు, ప్రలోభాలు ఎన్నికల సంఘానికి పెద్ద సవాల్‌గా మారాయని పేర్కొన్నారు.

‘త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికలతో కలిపి ఎన్నికల సంఘం ఇప్పటివరకు 400 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించింది. దీంతోపాటు 17 లోక్‌సభ ఎన్నికలు, 16 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలను ప్రజలు ఆమోదించారు. అధికార మార్పిడి ప్రతిసారి సజావుగా సాగుతోంది’ అని రాజీవ్‌ కుమార్‌ గుర్తుచేశారు. ఇదిలా ఉండగా,  కర్ణాటక అసెంబ్లీకి మే 24తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం స్వయంగా సమీక్షిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని