DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపునకు కేబినెట్‌ ఆమోదం

ఉద్యోగులందరికీ నాలుగు శాతం కరవు భత్యం (DA) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన భేటీలో కేబినెట్‌ (Cabinet) ఆమోదం తెలిపింది.

Updated : 24 Mar 2023 22:06 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Central Govt Employees) కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులందరికీ నాలుగు శాతం కరవు భత్యం (DA) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన భేటీలో కేబినెట్‌ (Cabinet) ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది. ఈ పెంపుతో కేంద్ర ఖజానాపై అదనంగా రూ. 12,815 కోట్లు భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur ) వెల్లడించారు. జనవరి 1, 2023 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు.

పెరుగుతున్న ధరల నుంచి కేంద్రం ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులకు ఊరటగా కేంద్రం  డీఏను ఇస్తుంది. వినియోగదారుల ధర సూచీ ఆధారంగా కేంద్రం డీఏను లెక్కిస్తుంది.  తాజా నిర్ణయంతో కేంద్రం పరిధిలోని 47.58 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షర్లకు (Pensioners) లబ్ధి చేకూరనుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేర డీఏ పెంచే అవకాశం ఉంది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని