CoronaVirus: కరోనా వ్యాప్తి నియంత్రణపై భారత్ మాక్ డ్రిల్ !
వివిధ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇక్కడ కూడా కరోనా వ్యాప్తి ఉద్ధృతమైతే ఎలా వ్యవహరించాలన్నదానిపై మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖ రాసింది.
దిల్లీ: చైనా (China) తోపాటు వివిధ దేశాల్లో కరోనా (CoronaVirus) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒక వేళ భారత్ (India)లోనూ కేసుల సంఖ్య పెరిగితే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై మాక్ డ్రిల్ (Mock Drill)నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ (Rajesh Bhushan) లేఖ రాశారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ లభ్యత, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలపై మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని లేఖలో కోరారు. ముఖ్యంగా ఐసీయూ పడకలు, వెంటిలేటర్ పడకల లభ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
కొవిడ్ రెండో దశ వ్యాప్తి భారత్‌పై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో.. ప్రాణవాయు సిలిండర్ల కోసం బారులు తీరిన దృశ్యాలు ఆందోళన కలిగించాయి. మరోవైపు పడకలు దొరక్కపోవడంతో ఆరుబయటే వైద్యం అందించిన సందర్భాలూ ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ముందుగానే అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. మునిపటిలా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రంతో కలిసి పని చేయాలని కోరింది.
నర్సులు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లను సైతం మాక్ డ్రిల్‌లో భాగస్వాములను చేయాలని కేంద్రం కోరింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని కోరింది. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు ప్రారంభించింది. చైనా, జపాన్, దక్షిణకొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది. మరోవైపు ఇతర దేశాల నుంచి వచ్చే వారిలో ర్యాండమ్‌గా 2శాతం మంది ప్రయాణికుల నమూనాలను సేకరించి జీనోమ్ ఫ్రీక్వెన్సింగ్‌కు పంపాలని నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.