China: మీ రొయ్యల్లో కరోనా ఉంది...చైనా మెలిక

భారత్‌ నుంచి దిగుమతయ్యే రొయ్యల ప్యాకింగ్ సామగ్రిపై కరోనా అవశేషాలు ఉన్నాయంటూ చైనా కొత్త మెలిక పెట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 20 కంపెనీలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన మరో....

Updated : 19 Jul 2021 16:59 IST

దిల్లీ: భారత్‌ నుంచి దిగుమతయ్యే రొయ్యల ప్యాకింగ్ సామగ్రిపై కరోనా అవశేషాలు ఉన్నాయంటూ చైనా కొత్త మెలిక పెట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 20 కంపెనీలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన మరో 40 సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు వెయ్యికిపైగా కంటైనర్ల సరకు చైనా పోర్టుల్లోనే నిలిచిపోయింది.

ఘనీభవించిన రొయ్యలను చైనా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. వీటి ఎగుమతుల పరిమాణంలో 46.44 శాతం, డాలర్‌ ఆదాయంలో 61.87 శాతం వాటా చైనాదే. ఏపీలో అధికంగా ఉత్పత్తి అయ్యే వనామీ రొయ్యకు అమెరికా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్‌ చైనాదే. తక్కువ కౌంట్‌ రొయ్యలను డ్రాగన్‌ అధికంగా దిగుమతి చేసుకుంటుంది. గత కొంతకాలంగా చైనాకు  వందలాది కంటైనర్లలో సరకు ఎగుమతి అవుతోంది. ఈ సందర్భంగా వాటికి పరీక్షలు నిర్వహించిన ఆ దేశం.. రొయ్యల ప్యాకింగ్‌పై కరోనా అవశేషాలున్నట్లు పేర్కొంది. దిగుమతులను నిలిపివేసింది. దీంతో మొత్తంగా రూ.వెయ్యి కోట్ల విలువైన రొయ్యల ఎగుమతులు నిలిచిపోయాయి. వ్యాపార సంస్థల వినతుల మేరకు వీటికి మరోమారు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

భారత్‌ నుంచి చైనాకు రొయ్యలతో వెళ్లే కంటైనర్లు సుమారు 25 రోజులపాటు ప్రయాణం చేస్తాయి. కరోనా వైరస్‌ అవశేషాలు ఇన్నిరోజులు ఉండటం ఎలా సాధ్యమని వ్యాపార సంస్థల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. రొయ్యలను ఘనీభవింపజేసి మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో రవాణా చేస్తారని.. అందులో ఎలాంటి వైరస్‌ అవశేషాలు ఉండే అవకాశం లేదని పేర్కొంటున్నారు. అయినా చైనా అధికారులు మాత్రం ఇవన్నీ పక్కనపెట్టి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేని నేపథ్యంలో ఇలాంటి కొర్రీలు పెడుతున్నారనే ఆవేదన వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఎగుమతి వ్యాపారులు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా చైనా ప్రభుత్వంతో సంప్రదించాలని.. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని