Fire Accident: కన్నూరులో నిలిచి ఉన్న ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలో మంటలు

కేరళ(Kerala)లో ఏప్రిల్ నాటి ఘటన మళ్లీ పునరావృతమైంది. గతంలో మాదిరిగానే మరోసారి రైల్లో మంటలు వచ్చాయి. కన్నూర్‌ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.

Updated : 01 Jun 2023 16:14 IST

కన్నూర్‌: కేరళ(Kerala)లోని కన్నూర్‌ రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న అలప్పుళ - కన్నూర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు(Alappuzha-Kannur Executive Express train) బోగీలో మంటలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అయితే, అప్పటికే ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే సిబ్బంది తెలిపారు. ఆ మంటల్లో బోగీ పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ బోగీని రైలు నుంచి వేరు చేశారు.(Express train caught fire)

అలాగే దగ్గర్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. వాటిని బట్టి ఒక గుర్తు తెలియని వ్యక్తి రైల్లోకి వెళ్లిన తర్వాత మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఉద్దేశపూర్వక ఘటనా..? కాదా..? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 2వ తేదీన కూడా ఈ తరహా ఘటన జరిగింది. అప్పట్లో అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆ రోజు రాత్రి పది గంటల సమయంలో అలప్పుళ - కన్నూర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు(Alappuzha-Kannur Executive Express train) కోజికోడ్‌ నగరాన్ని దాటి కోరపుళ రైల్వే వంతెన వద్దకు చేరుకోగానే ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికుడిపై పెట్రోల్‌ చల్లి నిప్పంటించాడు. చూస్తుండగానే ఆ మంటలు ఇతరులకు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్‌ లాగి రైలును నిలిపివేశారు. నాటి ఘటనలో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. వారి మృతదేహాలు కొద్దిదూరంలో ట్రాక్‌పై కనిపించాయి. మంటల నుంచి తప్పించుకునే వెళ్లిపోయే క్రమంలో వారు రైలుకు దూరంగా పడిపోయారని అప్పట్లో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఆ కేసులో దర్యాప్తు జరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని