Odisha Train Tragedy: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌ మారడం వల్లే.. రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక

ఒడిశా రైలు దుర్ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పొరబాటుగా లూప్‌లైన్‌లోకి మారడం వల్లే ఈ పెను విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Updated : 03 Jun 2023 17:35 IST

భువనేశ్వర్‌: ఒడిశా (Odisha)లోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ఘటన యావత్‌ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ దుర్ఘటన.. ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే, సిగ్నల్‌ లోపం కారణంగా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (Coromandel Express) మరో ట్రాక్‌లోకి ప్రవేశించడం వల్లే ఈ పెను విషాదం సంభవించినట్లు రైల్వే శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. (Odisha Train Tragedy)

ఒడిశా ప్రమాదంపై రైల్వే శాఖ (Indian Railway) ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. సిగ్నల్‌ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆ నివేదికలో పేర్కొంది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. లూప్‌లైన్‌లోకి మారినట్లు తెలిపింది. ‘‘చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌ లైన్‌ (Main Line)కి బదులుగా లూప్‌ లైన్‌లోకి ప్రవేశించింది. ఈ రైలు మెయిన్‌లైన్‌లోనే చెన్నై వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే, ఈ రైలు పొరపాటున లూప్‌లైన్‌ (Loop Line)లోకి ప్రవేశించింది. అప్పటికే ఆ లూప్‌లైన్‌లో గూడ్స్‌ రైలును నిలిపి ఉంచారు. దీంతో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ దాన్ని వేగంగా ఢీకొట్టి పట్టాలు తప్పింది. దీని బోగీలు పక్క ట్రాక్‌పైన పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 6.50 గంటలకు బహనగ స్టేషన్‌ దాటింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 6.52 గంటలకు ఖాంతాపార స్టేషన్‌ను దాటింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్‌ను ఢీకొట్టగానే దాని 21 బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో కొన్ని బోగీలు పక్కనున్న ట్రాక్‌పై పడిపోయాయి. అదే సమయంలో వచ్చిన బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ వీటిని ఢీకొట్టింది. దీంతో ఈ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయి’’ అని రైల్వే శాఖ తమ నివేదికలో వెల్లడించింది. 

సిగ్నలింగ్‌లో మానవ తప్పిదం కారణంగానే ఇది జరిగి ఉండొచ్చని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ప్రమాద సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 130 కి.మీల వేగంతో వెళ్తోంది. దీంతో లూప్‌లైన్‌ ఉన్న గూడ్స్‌ రైలును గుర్తించినా వేగాన్ని నియంత్రించలేకపోయినట్లు తెలుస్తోంది. గూడ్స్‌ను ఢీకొట్టగానే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌.. దానిమీదకు దూసుకెళ్లినట్లు రైల్వే అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా కొన్ని బోగీలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంతమంది ప్రయాణికులు ఉన్నారంటే..

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 1257 మంది రిజర్వ్‌డ్‌ ప్రయాణికులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో 1039 మంది రిజర్వ్‌డ్‌ ప్రయాణికులు ఉన్నట్లు తెలిపాయి. అయితే వీరు కాకుండా జనరల్‌ బోగీల్లో ఎంతమంది ఎక్కారన్నది తెలియదు.

ఎంటీ లూప్‌లైన్‌..?

రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. స్టేషన్‌ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ లూప్‌లైన్లను నిర్మిస్తారు. ఈ లూప్‌లైన్ల పొడవు 750 మీటర్లు ఉంటుంది. మల్టిపుల్‌ ఇంజిన్లు ఉండే ఒక గూడ్స్‌ రైలు ఆగేందుకు వీలుగా వీటిని నిర్మిస్తారు.

సాధారణంగా.. సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లకు లూప్‌లైన్‌లోకి వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చేప్పుడు..హైస్పీడ్‌లో వెళ్లే విధంగా నీలిరంగు సిగ్నల్‌ కాకుండా నెమ్మదిగా వెళ్లే విధంగా సిగ్నల్ ఇస్తారు. అయితే, ఇక్కడ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌లైన్లోకి వెళ్లేందుకు సిగ్నల్‌ ఇచ్చినా లూప్‌లైన్‌లోకి ఎలా వచ్చిందన్న దానిపై రైల్వే శాఖ దర్యాప్తు చేపట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని