Satyendar Jain: దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురు

ఆమ్‌ఆద్మీ పార్టీ నేత సత్యేందర్‌ జైన్‌కు న్యాయస్థానంలో మళ్లీ చుక్కెదురయ్యింది. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన ఆయన ఇటీవల బెయిల్‌ కోసం అభ్యర్థించారు. వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం.. జైన్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Published : 17 Nov 2022 22:50 IST

దిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత, దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన ఆయన.. ఇటీవల పెట్టుకున్న బెయిల్‌ అభ్యర్థనను దిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. జైన్‌తోపాటు అంకుష్‌ జైన్‌, వైభవ్‌ జైన్‌ల బెయిల్‌ పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది. సత్యేందర్‌ జైన్‌ బెయిల్‌ను తిరస్కరించడం ఇది రెండోసారి.

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్‌ జైన్‌.. ఈ ఏడాది మే 30న అరెస్టయ్యారు. 2017లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. అయితే, జూన్‌ నెలలో ఒకసారి బెయిల్‌ కోసం అభ్యర్థించినప్పటికీ.. ఆయనపై ఉన్న అభియోగాల తీవ్రత దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయలేమని కోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. తాజాగా బెయిల్‌ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోగా.. దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదని ఈడీ వాదించడంతో ఈసారి కూడా కోర్టులో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది.

సత్యేందర్‌ జైన్‌ జైలులో ఉన్న సమయంలోనే ఆయనకు అక్కడ వీఐపీ మర్యాదలు అందుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. వీటిపైనా దర్యాప్తు జరిగింది. సీసీటీవీ ఫుటేజీలో ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు ఈడీ అందించింది. దీంతో తీహాడ్‌ జైలు సూపరింటెండెంట్‌ ఇటీవలే సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని