Arpita Mukherjee: అర్పిత డైరెక్టర్‌గా ఉన్న మూడు సంస్థల్లో ఈడీ సోదాలు

పశ్చిమ బెంగాల్‌లో పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణానికి సంబంధించిన అన్ని అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పూర్తిస్థాయిలో దృష్టిసారించినట్లు తెలుస్తోంది.......

Published : 29 Jul 2022 17:41 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణానికి సంబంధించిన అన్ని అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పూర్తిస్థాయిలో దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee) తోపాటు ఆమె సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee) ఇంట్లో భారీగా నగదు లభించిన నేపథ్యంలో ఆమెకు సంబంధమున్న మూడు సంస్థలపై ఈడీ దృష్టిసారించింది. ఆయా సంస్థల్లో దర్యాప్తులు నిర్వహిస్తోంది. ఛటర్జీతో సన్నిహిత సంబంధాల అనంతరమే ఆ సంస్థల్లో అర్పితకు ఉన్నత పదవి దక్కినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

కోల్‌కతా వేదికగా నడిచే హోల్‌సేల్ వ్యాపారం నిర్వహించే ‘సింబయాసిస్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు అర్పితా ముఖర్జీ డైరెక్టర్‌గా ఉన్నారు. 2011 మార్చి 21న స్థాపించిన ఈ కంపెనీకి అర్పితతోపాటు కల్యాణ్‌ ధర్‌ అనే వ్యక్తి 2021 జులై 1న డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2011 నవంబర్‌ 9న స్థాపించిన ‘సెంట్రీ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కు, 2014 అక్టోబర్ 29 స్థాపించిన ‘అర్పిత ఎచ్చెయ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థకు కూడా అర్పితతోపాటు కల్యాణ్‌ ధర్‌ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూడు సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

అర్పితకు చెందిన రెండు ఫ్లాట్లలో ఈడీ జరిపిన సోదాల్లో దాదాపు రూ.50కోట్ల నగదు, బంగారు ఆభరణాలు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గత వారంలో అర్పితా ముఖర్జీ నివాసంలో రూ.21 కోట్ల విలువైన కరెన్సీ కట్టలు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.. ఆమెకు చెందిన మరో ఇంట్లో బుధవారం దాదాపు 18గంటల పాటు సోదాలు చేసి మరో రూ.29కోట్లు నగదు, 5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని