ED Summons: కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదోసారి నోటీసులు

దిల్లీ మద్యం కేసులో విచారణకు మార్చి 4న హాజరు కావాలంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎనిమిదోసారి సమన్లు జారీ చేసింది.

Published : 27 Feb 2024 15:13 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి విచారణకు మార్చి 4న రావాలని పేర్కొంది. ఇలా కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడం ఇది ఎనిమిదోసారి. ఏడోసారి ఇచ్చిన నోటీసుల గడువు (సోమవారం) ముగిసిన మరుసటి రోజే మరోసారి సమన్లు జారీ కావడం గమనార్హం.

దిల్లీ మద్యం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు నవంబర్‌ 2న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తొలిసారి సమన్లు జారీ చేసింది. అనంతరం వరుసగా నోటీసులు పంపిస్తున్నప్పటికీ ఆయన హాజరు కావడం లేదు. ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్న తరుణంలో ఈడీ నోటీసులు పంపించడం చట్టవిరుద్ధమని వాదిస్తున్నారు. ఇలా పదేపదే సమన్లు జారీ చేయడం సరికాదని, కోర్టు ఆదేశాలు వెలువడే వరకు ఓపికతో వేచి ఉండాలని ఈడీని ఆప్‌ కోరింది. కానీ తాజాగా మరోసారి సమన్లు జారీ అయ్యాయి.

ఈ కేసులో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ కొద్దిరోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలాఉంటే, కేజ్రీవాల్‌ను త్వరలోనే సీబీఐ అరెస్టు చేయనుందని ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు ఇటీవల ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని