ED raids: ఈడీ అధికారులపై టీఎంసీ మద్దతుదారుల దాడి.. వాహనాలు ధ్వంసం

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షేక్‌ షాజహాన్‌ నివాసంలో తనిఖీలు చేసేందుకు వచ్చిన ఈడీ (ED) అధికారులపై టీఎంసీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు.

Updated : 05 Jan 2024 18:50 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రేషన్‌ పంపిణీ కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుతో సంబంధమున్నట్లు భావిస్తోన్న 15 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం దాడులకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షేక్‌ షాజహాన్‌ నివాసంలో తనిఖీలు చేసేందుకు వచ్చిన ఈడీ (ED) అధికారులపై టీఎంసీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రాష్ట్రంలో వెలుగు చూసిన రేషన్‌ పంపిణీ కుంభకోణంలో మంత్రి జ్యోతిప్రియ మలిక్‌ ఇటీవల అరెస్టయ్యారు. ఆయనకు షాజహాన్‌ అత్యంత సన్నిహితుడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ శుక్రవారం 15చోట్ల దాడులు నిర్వహించింది. సీఆర్‌పీఎఫ్‌ బలగాల భద్రత నడుమ షాజహాన్‌ ఇంటికి చేరుకోగానే.. అక్కడున్న ఆందోళనకారులు వారి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారు. వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు ఈడీ అధికారులు, కేంద్ర బలగాలపైనా దాడులకు తెగబడ్డారు. దీంతో పరుగులు పెట్టిన అధికారులు.. ఆటోలు, బైకుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.

ఎన్ని కుట్రలు చేసినా..‘మా దోస్తీ’ ఎప్పటికీ చెదరనిది: సిసోదియాకు కేజ్రీవాల్‌ విషెస్‌

ఈ ఘటనలో ఇద్దరు ఈడీ అధికారులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మీడియాపైనా దాడులకు పాల్పడటంతో కొందరికి గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ దాడులను బెంగాల్‌ భాజపా తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో తాజా ఘటన రుజువు చేస్తోందని భాజపా నేత సువేందు అధికారి పేర్కొన్నారు. ఈ దాడుల్లో రోహింగ్యాలు ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రహోంశాఖ సహా ఇతర విభాగాలకు విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని