Mehbooba Mufti: ‘చనిపోయిన వారినీ విడిచిపెట్టలేదు’.. ముఫ్తీ వ్యాఖ్యలు

ఇటీవల కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు సయ్యద్‌ అలీ షా గిలానీ(92) మృతదేహంపై పాక్‌ జాతీయ పతాకాన్ని కప్పడం, దేశ వ్యతిరేక నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో స్థానిక బుడ్గాం పోలీసులు...

Published : 06 Sep 2021 01:12 IST

శ్రీనగర్‌: ఇటీవల కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు సయ్యద్‌ అలీ షా గిలానీ (92) మృతదేహంపై పాక్‌ జాతీయ పతాకాన్ని కప్పడం, దేశ వ్యతిరేక నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో స్థానిక బుడ్గాం పోలీసులు పలువురిపై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీన్ని మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. కేంద్రం తీరును విమర్శిస్తూ ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘కశ్మీర్‌ను ఇప్పటికే బహిరంగ జైలుగా మార్చారు. ఇప్పుడు చనిపోయిన వారినీ విడిచిపెట్టలేదు. కోరుకున్నట్లుగా గిలానీకి తుది వీడ్కోలు పలికేందుకు, సంతాపం ప్రకటించేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతించలేదు. ఇప్పుడు ఉపా చట్టం కింద వారిపై కేసు నమోదు చేయడమనేది.. కేంద్ర ప్రభుత్వ నిర్దయను చూపుతోంది. ఇదీ కొత్త భారతదేశపు సరికొత్త కశ్మీర్‌’ అని అందులో పేర్కొన్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గిలానీ బుధవారం రాత్రి శ్రీనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలియగానే పోలీసులు కశ్మీర్‌ లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించారు. మొబైల్‌ సేవలను నిలిపివేశారు. భారీ భద్రత నడుమ ఇస్లాం మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని