Civils: విధి వీల్‌చైర్‌కు పరిమితం చేసినా.. కృషి కలెక్టర్‌ను చేసింది!

ఎనిమిదేళ్లకే కండరాల బలహీనత. అవయవాల పనితీరు స్తంభించిపోయి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తోటి మిత్రులతో కలిసి ఆడుతూపాడుతూ గడపాల్సిన......

Published : 08 Jun 2022 02:06 IST

స్ఫూర్తిని రగిల్చే ఓ యువకుడి కథ ఇదీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎనిమిదేళ్లకే కండరాల బలహీనత. అవయవాల పనితీరు స్తంభించిపోయి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తోటి మిత్రులతో కలిసి ఆడుతూపాడుతూ గడపాల్సిన అతడి బాల్యం ఆసుపత్రులు, శస్త్రచికిత్సలతో గడిచిపోయింది. ఆ పాడు వ్యాధి అవయవాలను మింగేస్తూ.. శరీరాన్ని కదలనీయకుండా చేసినా.. అతడి ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయింది. చేతులతో రాయలేని పరిస్థితి.. అయినా వ్యాధి ఎంత కిందికి లాగినా బంతిలా పైకి దూసుకొచ్చాడు. అంగవైకల్యం ఉన్న వీడేంసాధిస్తాడురా అంటూ విమర్శలు చేసినవారి నోరు మూయిస్తూ.. ప్రతిష్ఠాత్మక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO)లో కొలువు సాధించాడు. మరో అడుగు ముందుకేసిన ఆ కుర్రాడు.. ఇటీవలే విడుదలైన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు పరీక్ష ఫలితాల్లో సత్తా చాటాడు.

అంగవైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన శాస్త్రవేత్త అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు స్టీఫెన్‌ హాకింగ్‌.. కానీ మన దేశంలోనూ ఓ యువ శాస్త్రవేత్త ఉన్నాడు. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ఇస్రోలో పనిచేస్తున్నాడు కార్తిక్‌ కన్సల్‌. వీల్‌ చైర్‌లోనే ఆఫీస్‌కు వచ్చి తన విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా అతడు యూపీఎస్సీ ఫలితాల్లో 271వ ర్యాంకు సాధించి తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఏదైనా సాధించాలంటే అంగవైకల్యం అడ్డు కాదని.. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం మన పాదాక్రాంతమవుతుందని నిరూపించాడు.

వైకల్యం కారణంగా దక్కని ప్లేస్‌మెంట్‌

కార్తిక్‌ ఎనిమిదేళ్లున్న సమయంలో కండరాలు బలహీనమయ్యే మస్క్యులర్‌ డిస్ట్రఫీ వ్యాధి బారిన పడ్డాడు. పలు శస్త్రచికిత్సలు, వ్యాయామాలతో కోలుకున్నప్పటికీ.. లేచి నిల్చోలేని పరిస్థితి. దీంతో వీల్‌చైర్‌కే పరిమితయ్యాడు. కానీ, లేవలేని స్థితిలోనైనా పట్టుదల ప్రదర్శించాడు. అనారోగ్యం, అవహేళనలు, అవమానాలు ఎదుర్కొంటూ చదువుల్లో రాణించాడు. 2018లో ఐఐటీ రూర్కీలో విద్యాభ్యాసం పూర్తి చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్‌తో సహా అనేక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాడు. అయినా అంగవైకల్యం కారణంగా ప్లేస్‌మెంట్ పొందలేకపోయాడు.

వ్యవస్థలో మార్పు తీసుకురావాలని..

ఓ జాతీయ మీడియాతో కార్తిక్ ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ.. ఈ వివక్షే తనలో స్ఫూర్తిని రగిలించిందని పేర్కొన్నాడు. ‘నేను ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌ బాగా రాశాను. కానీ మెయిన్స్‌కు అర్హత సాధించలేకపోయా. నా వైకల్యం కారణంగా నేను ఏ పోస్టుకు కూడా అర్హత పొందలేదని తెలిసింది. అప్పుడు ఎంతో క్షోభకు గురయ్యా. కానీ, మానసికంగా బలంగా ఉన్నా.. శారీరకంగా నాలా ఉన్నవారికి ఇలాంటివి ఆటంకం కలిగిస్తున్నాయని తెలుసుకున్నా. ఈ తిరస్కరణే నేను సివిల్స్‌పై దృష్టిపెట్టేందుకు దారితీసింది. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని అప్పుడే దృఢంగా నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నాడు.

తొలి ప్రయత్నంలో 813 ర్యాంకు సాధించినా..

2019లో సివిల్స్‌ తొలి ప్రయత్నంలోనే కార్తిక్‌ 813 ర్యాంకు సాధించాడు. కానీ మరిన్ని మార్కులు పెంచుకుని అడ్మినిస్ట్రేటివ్ పోస్టు సాధించాలనుకున్నాడు. కానీ 2020లో మెయిన్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. 2021లో మూడో ప్రయత్నంలో 271వ ర్యాంకుతో మెరిశాడు. ‘యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు చేతి వేళ్లు సహకరించకపోవడంతో మూడు నెలలపాటు ప్రతిరోజు నాలుగు గంటలు సాధన చేశాను’ అని కార్తిక్‌ తెలిపాడు. ప్రస్తుతం ఇస్రోలో పనిచేస్తూనే ఈ ర్యాంకు సాధించాడు. పనిదినాల్లో ఉదయం రెండు గంటలు, ఆఫీస్‌ నుంచి వచ్చాక 6.30 నుంచి రాత్రి 11 గంటలపాటు చదువుకునేవాడినని పేర్కొన్నాడు. వారాంతరాల్లో మరింత సమయం కేటాయించినట్లు వివరించాడు. తన ఈ జర్నీలో అమ్మ పాత్ర ఎంతో ఉందని, ఆమె సహకారంతోనే ఇదంతా సాధ్యమైనట్లు చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని