France: టీకాకు నిరాకరణ.. మూడువేల మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

కరోనా కట్టడికి టీకా వేయించుకోవడమే ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలు ఈ దిశగా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేస్తున్నాయి. ఫ్రాన్స్‌ సైతం ఇదే కోవలో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో టీకా తీసుకోని వారి...

Updated : 16 Sep 2021 22:23 IST

ఆరోగ్య సిబ్బందిపై చర్యలు తీసుకున్న ఫ్రాన్స్‌ ప్రభుత్వం

పారిస్‌: కరోనా కట్టడికి టీకా వేయించుకోవడమే ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలు ఈ దిశగా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేస్తున్నాయి. ఫ్రాన్స్‌ సైతం ఇదే కోవలో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో టీకా తీసుకోని వారి విషయంలో కఠినంగానూ వ్యవహరిస్తోంది. తాజాగా గడువులోగా వ్యాక్సిన్‌ వేయించుకోని వేలాది మంది ఆరోగ్య సిబ్బందిని సస్పెండ్‌ చేసింది. ఈ విషయాన్ని దేశ ఆరోగ్య మంత్రి ఒలివియర్ వెరాన్ గురువారం ధ్రువీకరించారు. హెల్త్‌ సెంటర్స్‌, క్లినిక్‌లలో పని చేసే దాదాపు మూడు వేలమందిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. టీకా వేయించుకోవడాన్ని నిరాకరిస్తూ.. పదుల సంఖ్యలో ఉద్యోగులు రాజీనామా కూడా చేసినట్లు వెల్లడించారు. 

70 శాతం మందికి పూర్తి..

ఆసుపత్రుల్లో పనిచేసేవారు, అగ్నిమాపక సిబ్బంది, రిటైర్డ్‌ హోం వర్కర్స్‌ తదితరులు సెప్టెంబరు 15లోగా తప్పనిసరిగా కనీసం ఒక డోస్‌ అయినా వేయించుకోవాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్‌ మెక్రాన్‌ జులైలో ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. తాజాగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. టీకా సమర్థత, ఆరోగ్య భద్రతపై అపోహలతోనే చాలా మంది, ముఖ్యంగా నర్సులు వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి విముఖత చూపినట్లు సమాచారం. సుమారు 12 శాతం హాస్పిటల్ సిబ్బంది, దాదాపు ఆరు శాతం వైద్యులు ఇంకా టీకా వేయించుకోలేదని ఫ్రాన్స్ నేషనల్‌ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ గత వారం అంచనా వేసింది. మొత్తంమీద దేశవ్యాప్తంగా 70 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. ఇక్కడ 12 ఏళ్లు దాటినవారందరికీ టీకా అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని