
ఫ్రాన్స్: మూడో ధాటికి మూడోసారి లాక్డౌన్!
ప్రకటించిన అధ్యక్షుడు మేక్రాన్
పారిస్: ఏడాది గడుస్తోన్నా.. కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఫ్రాన్స్ మరోసారి లాక్‌డౌన్‌కు సిద్ధమయ్యింది. ప్రస్తుతం అక్కడ కరోనా మూడో దఫా విజృంభణతో మూడోసారి లాక్డౌన్ విధించక తప్పడం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు.
కరోనా వైరస్ తీవ్రతకు ఫ్రాన్స్ మరోసారి వణికిపోతోంది. ఇప్పటికే అక్కడ మూడోదఫా(థర్డ్‌వేవ్) విజృంభణ కొనసాగుతోంది. ఫ్రాన్స్‌లో కొవిడ్ మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. కరోనా రోగులతో అక్కడి ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాలు కిక్కిరిసిపోతున్నాయి. వీటివల్ల ఆసుపత్రులు, ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి పూర్తి లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని మేక్రాన్ ప్రకటించారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి వ్యవస్థలన్నీ తెరిచే ఉంచాలనే తన లక్ష్యాన్ని మెక్రాన్ వదులుకోవాల్సి వచ్చింది.
‘ప్రస్తుతం మనం సరైన చర్యలు తీసుకోకుంటే..నియంత్రణ కోల్పోతాం’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ లాక్డౌన్ ప్రకటన సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఉన్నాయని.. ప్రస్తుతం వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ తొలి శనివారం నుంచి మూడు వారాలపాటు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించారు.
కొవిడ్ కేసుల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానం..
కరోనా వైరస్ విజృంభణతో గతేడాది తీవ్రంగా నష్టపోయిన ఫ్రాన్స్..మరోసారి లాక్డౌన్ విధించేందుకు అధ్యక్షుడు మేక్రాన్ సుముఖత చూపలేదు. మరోసారి లాక్డౌన్ విధించకుండానే దేశాన్ని ముందుకు నడుపుతానని పలు సందర్భాల్లో వెల్లడించారు. తద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని ధీమా వ్యక్తంచేశారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో మూడోసారి లాక్డౌన్ విధించక తప్పలేదని తెలుస్తోంది. జాన్స్హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, ఫ్రాన్స్‌లో కొవిడ్ కేసుల సంఖ్య 47లక్షలు దాటగా, దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ కేసుల్లో భారత్ మూడోస్థానంలో ఉండగా, ఫ్రాన్స్ ప్రపంచంలోనే నాలుగోస్థానంలో ఉంది. ప్రస్తుతం అక్కడ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ పొరుగుదేశం బ్రిటన్‌తో పోలిస్తే వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. లాక్‌డౌన్‌తో ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, అధ్యక్షుడు మాత్రం జూన్ నాటికి దేశ జనాభాలో సగం మందికి(3కోట్ల మందికి) వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.