జేఎన్‌యూలో దీపిక: రాజన్‌ ప్రశంసలు

దేశ రాజధానిలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై జరిగిన దాడిలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రముఖ నటి దీపికా పదుకొణెపై విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Published : 11 Jan 2020 11:19 IST

దిల్లీ: దేశ రాజధానిలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై జరిగిన దాడిలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రముఖ నటి దీపికా పదుకొణెపై విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ కూడా దీపిక చర్యను సమర్థించారు. ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ మేరకు లింక్డ్‌ఇన్‌ బ్లాగులో రాసుకొచ్చారు. 

భారత్‌లోని ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీల్లో ఒకటైన జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి జరగడం, దాన్ని పోలీసులు ఏ మాత్రం అడ్డుకోకపోపవడం ‘ఆందోళనకరం’ అని రాజన్‌ పేర్కొన్నారు. తన కొత్త సినిమా ‘ఛపాక్‌’ భవిష్యత్‌ను ప్రమాదంలో పెట్టి మరీ జేఎన్‌యూలో బాధిత విద్యార్థులను పరామర్శించి నిశ్శబ్ద ఆందోళన చేపట్టిన ఆ బాలీవుడ్‌ నటి(దీపికను ఉద్దేశిస్తూ) మనందరిలో స్ఫూర్తిని నింపుతోందని కొనియాడారు. 

గత ఆదివారం జేఎన్‌యూలో విద్యార్థులు, అధ్యాపకులపై హింసాత్మక దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత జేఎన్‌యూ వెళ్లిన దీపిక బాధిత విద్యార్థులను పరామర్శించారు. అయితే దీనిపై కొందరు దీపికను ప్రశంసించగా.. మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా దీపికను తప్పుబట్టారు. దేశ వినాశనాన్ని కోరుకునే వారికి ఆమె మద్దతిచ్చారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని