2020 అత్యుత్తమ నివాసయోగ్య దేశాలు ఏవంటే...

2020లో నివసించటానికి అనువైన అత్యుత్తమ దేశాల జాబితాలో మొదటి 25 దేశాల్లో భారత్ స్థానం సంపాదించుకుంది. ఈ జాబితాలో భారత్ కన్నా ముందు ఇతర ఆసియా దేశాలైన చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా...

Published : 16 Jan 2020 21:37 IST

దిల్లీ: 2020లో నివసించటానికి అనువైన అత్యుత్తమ దేశాల జాబితాలో మొదటి 25 దేశాల్లో భారత్ స్థానం సంపాదించుకుంది. ఈ జాబితాలో భారత్ కన్నా ముందు ఇతర ఆసియా దేశాలైన చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్ (యుఏఈ) ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే భారత్ రెండు స్థానాలు మెరుగుపరుకొని 25వ స్థానంలో చోటుదక్కించుకొంది. ఇక మొదటి, రెండు, మూడు స్థానాల్లో వరుసగా కెనడా, స్విట్జర్లాండ్, నార్వే దేశాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన యూఎస్‌ న్యూస్‌ సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీనికోసం 73 దేశాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

ఇదే సర్వేలో భారత్ గురించి మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. పిల్లల పెంపకానికి సంబంధించి అనువైన దేశాల జాబితాలో మాత్రం భారత్ 59వ స్థానంలో ఉంది. దీనికి కారణం 73 దేశాల ప్రజలకు భారత్‌లో పిల్లల పెంపకం గురించి సదభిప్రాయంతో లేరని నివేదిక గణాంకాలు తెలిపాయి. ఈ విషయాన్ని బలపరుస్తూ బుధవారం భారతీయ రైల్వే ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం 2019లో 16,457 మంది పిల్లల్ని రైళ్లు, రైల్వే స్టేషన్ల నుంచి కాపాడినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. ఈ లెక్కన రైల్వే రక్షణ దళం రోజుకు 46 మంది పిల్లల్ని కాపాడినట్లు ఆ నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. పిల్లల పెంపకానికి సంబంధించిన కేటగిరీలో సింగపూర్‌, కెన్యా, ఈజిప్ట్‌ వంటి దేశాలు భారత్ కన్నా ముందంజలో ఉన్నాయి. ఈ జాబితాలో గతేదాడి 65వ స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది ఆరు స్థానాలు మెరుగుపరచుకొన్నట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు.

మహిళల రక్షణకు సబంధించిన జాబితాలో గతేడాదితో పోలిస్తే భారత్ ఒక స్థానం దిగజారి 58వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ముస్లిం దేశాలైన యుఏఈ, ఖతార్‌, సౌదీ అరేబియా దేశాలు భారత్ కంటే ముందంజలో ఉన్నాయి. పొరుగు దేశాలైన చైనా, శ్రీలంక కూడా భారత్ కన్నా మెరుగైన స్థానాల్లో ఉండటం గమనార్హం. ఇక నేరాల నమోదులో భారత్‌లో ప్రతి లక్ష జనాభాకు 2.2 శాతం మంది హత్యకు గురవుతుండగా, 5.2 శాతం మంది మహిళలు హత్యాచారానికి గురవుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని